
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రైవేట్ కంపెనీకి రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును కట్టబెట్టడంలో అవినీతికి సంబంధించి మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌పై సీబీఐ సోమవారం చార్జిషీట్ నమోదు చేసింది. కోర్టుకు సమర్పించిన అభియోగపత్రంలో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి సహా 14 మంది పేర్లను ప్రస్తావించింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల రబ్రీ దేవిని ప్రశ్నించింది. భారత రైల్వేల అనుబంధ ఐఆర్‌సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాత హోటల్స్ అనే సంస్థకు లాలూ కట్టబెడుతూ ప్రతిఫలంగా పాట్నాలో బినామి కంపెనీ పేరుతో మూడు ఎకరాల అత్యంత ఖరీదైన ప్లాట్‌ను పొందారని ఆరోపణలున్నాయి.
సుజాత హోటల్స్‌కు అనుచిత లబ్ధి కలిగేలా తన పదవిని ఉపయోగించారని లాలూపై ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలను పొందుపరిచారు. రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించారని ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. సుజాత హోటల్స్‌కు టెండర్ దక్కగానే సదరు స్థలం కూడా సరళా గుప్తా నుంచి రబ్రీ దేవి, తేజస్వి యాదవ్‌ల చేతుల్లోకి వచ్చిందని ఆరోపించింది.