
ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బోర్డు పరీక్షలను వాయిదా వేసిన సీబీఎస్‌ఈ
సాక్షి, న్యూఢిల్లీ : అల్లర్లతో దేశ రాజధాని అట్టుడుకుతున్న క్రమంలో ఈనెల 28, 29 తేదీల్లో ఈశాన్య ఢిల్లీలో జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్టు సీబీఎస్‌ఈ గురువారం వెల్లడించింది. ఈ తేదీల్లో జరగాల్సిన పరీక్షలను ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ ట్వీట్ చేసింది. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్ధితి సజావుగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం సైతం పరీక్షలను వాయిదా వేయాలని సీబీఎస్‌ఈని కోరింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో బోర్డు ఎగ్జామ్స్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రకటించాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్‌ఈని ఆదేశించింది. ఇక ఈశాన్య ఢిల్లీలోని 80 పరీక్షా కేంద్రాల్లో నేడు జరగాల్సిన పన్నెండో తరగతి బోర్డు పరీక్షను వాయిదా వేసినట్టు సీబీఎస్‌ఈ ఇప్పటికే ప్రకటించింది.