
పెండింగ్ సబ్జెక్ట్ పరీక్షలపై వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : పదో తరగతి పెండింగ్ సబ్జెక్టు పరీక్షలపై నెలకొన్న గందరగోళానికి సీబీఎస్‌ఈ తెరదించింది. పది, పన్నెండో తరగతి పెండింగ్‌లో ఉన్న పరీక్షలు నిర్వహించనందున ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్ధులను ప్రమోట్ చేయాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని పేర్కొనడంతో అసలు ఈ పరీక్షలు రద్దయ్యాయా లేదా అనే గందరగోళం ఏర్పడింది. మరోవైపు పెండింగ్‌లో ఉన్న పదవ తరగతి మైనర్ సబ్జెక్టుల పరీక్షలు రద్దవుతాయని సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి పేర్కొన్నారు. రద్దు చేసినా విద్యార్థుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపని మైనర్ సబ్జెక్టుల పరీక్షలనే రద్దు చేసినట్టు సీబీఎస్‌ఈ బుధవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇక పెండింగ్‌లో ఉన్న పదో తరగతి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలను బోర్డు నిర్వహిస్తుందని స్పష్టం చేసింది. బోర్డు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 1న జారీ చేసిన ప్రకటనలో ఎలాంటి మార్పూ లేదని సీబీఎస్‌ఈ పేర్కొంది. ఢిల్లీ అల్లర్లతో అక్కడ వాయిదా పడిన ప్రధాన పేపర్ల పరీక్షలను లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలు ప్రారంభమయ్యే పది రోజుల ముందుగానే అందరకి పరీక్షల వివరాలను తెలియచేస్తామని పేర్కొంది. కాగా పన్నెండో తరగతి పెండింగ్ పరీక్షల గురించి బోర్డు ప్రస్తావించకపోవడం గమనార్హం.