గుర్మీత్ తీర్పు: జైలుకే జడ్జి!
గుర్మీత్ తీర్పు: జైలుకే జడ్జి!
Published Sat, Aug 26 2017 6:50 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM
ఛండీగఢ్: జంట అత్యాచార కేసులో ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు సోమవారం శిక్షలు ఖరారు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పంచకులలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన్ను జైలు నుంచి కోర్టుకు తరలించే అవకాశాలు కనిపించటం లేదు.
ఈ నేపథ్యంలో న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌నే రోహతక్ జైలుకు తీసుకెళ్తామని హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీఎస్ సంధు వెల్లడించారు. ఛండీగఢ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఒకవేళ అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయనకు శిక్షలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇక అల్లర్లలో పంచకులలో 30 మంది, సిస్రాలో ఆరుగురు చనిపోగా, 269 మంది గాయపడినట్లు డీజీపీ సంధు వెల్లడించారు.
జడ్జికి భద్రత కల్పించండి: కేంద్ర హోంశాఖ
రాష్ట్రాన్ని వణికిస్తున్న డేరా అనుచరుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే శాంతి భద్రతలు పరిరక్షించాలంటూ కేంద్రం హర్యానా ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గుర్మీత్‌ను దోషిగా తేల్చిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్‌కు హైలెవల్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖ నుంచి హర్యానా పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి.
తీర్పు అనంతరం నెలకొన్ని పరిస్థితుల నేపథ్యంలో జడ్జికి భద్రత పెంచాలనే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. హోంశాఖ వర్గాలతో చర్చించి అవసరమైతే జగ్దీప్ సింగ్‌కు సీఆర్పీఎఫ్ లేక సీఐఎస్‌ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తామని హర్యానా పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
గుర్మీత్‌ను దోషిగా ప్రకటించిన వెంటనే హర్యానాతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు సృష్టించిన భీభత్సం, హింసలో 31 మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉండటంతో కర్ఫ్యూను ఎత్తివేసినట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సంయమనం పాటించినందుకు పంజాబ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
Advertisement
Advertisement