న్యూఢిల్లీ: ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా 8 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళల భద్రతను కట్టుదిట్టం చేసేలా త్వరలోనే సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యవసర ప్రతిస్పందన బృందాలు, పోలీసు ధ్రువీకరణ పొందిన ప్రజారవాణా వ్యవస్థల ఏర్పాటు, పోలీస్‌శాఖలో 33% మహిళా రిజర్వేషన్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నియంత్రణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయని వెల్లడించింది.
మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, పౌర సమాజం ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో బుధవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో నగరాల్లో మహిళల రక్షణకు అనుసరిస్తున్న విధానాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ భేటీలో ఢిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన ‘హిమ్మత్’ యాప్, హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన ‘హ్యాక్‌ఐ’, భరోసా కార్యక్రమం, బెంగళూరు పోలీసులు తెచ్చిన ‘సురక్షా’ యాప్, యూపీ పోలీసులు ప్రారంభించిన ‘పవర్ ఏంజిల్స్’ కార్యక్రమంపై చర్చించారు. తొలుత ఈ 8 నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మహిళల భద్రతపై ప్రణాళికల్ని రూపొందించి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీలకు పంపుతాయని రాజీవ్ గౌబా మీడియాకు తెలిపారు. వారు పంపిన ప్రణాళికల్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment