కెమిస్ట్రీ పండింది..!
ఒబామా, మోదీల మధ్య కుదిరిన సాన్నిహిత్యం, పెరిగిన అనుబంధం ఒబామా పర్యటనలో స్పష్టంగా కనిపించింది. ఇరువురు కలిసి పాల్గొన్న విలేకరుల సమావేశంలో పేలిన చమత్కారాల్లో అది మరింత స్పష్టమైంది. భారతీయులకు ‘మేరా ప్యార్ భరా నమస్కార్’ అంటూ హిందీలో శుభాకాంక్షలు తెలిపిన ఒబామా.. మోదీతో తన సాన్నిహిత్యంపై జోక్స్ కూడా వేశారు. ‘హైదరాబాద్ హౌస్ లాన్‌లో ఈ రోజు.. రోజులో ఎంతసేపు నిద్రపోతాం అనే విషయం సహాచాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాకన్నా మోదీ చాలా తక్కువగా నిద్రపోతారు. అయినా ఆయనింకా అధికారానికి కొత్త కదా! అధికారంలో ఇంకో ఐదారేళ్లు ఉంటే ఇంకో గంట అదనంగా నిద్రపోతారు’ అంటూ ఒబామా చమత్కరించారు.
‘చాయ్ పే’కు థాంక్యూ!
2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలకు మోదీని దగ్గర చేసిన ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని ఆదివారం మోదీతో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఒబామా ప్రస్తావించడం విశేషం. అంతకుముందే హైదరాబాద్ హౌస్ గార్డెన్‌లో ఒబామాకు మోదీ స్వయంగా టీ కలిపి ఇచ్చిన విషయాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘ప్రైమ్ మినిస్టర్ మోదీ.. థాంక్యూ.. నాతో జరిపిన చాయ్ పే చర్చ సహా నాకు ఆతిథ్యం ఇచ్చినందుకు థాంక్యూ’ అన్నారు. ఇలాంటి చాయ్ పే చర్చ కార్యక్రమాలు చాలా వాషింగ్టన్‌లోనూ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు.