మెడకు చుట్టుకున్న అప్పులు అతడిలోని విచక్షణ జ్ఞానాన్ని అణిచివేశాయి. భార్యపిల్లలపై అవాజ్య మైన ప్రేమ అతడిలోని సహజ నైజాన్ని రూపుమాపి హంతకుడిగా మార్చివేసింది. కుటుంబంలో ఎవరూ మిగలకూడదని చేసిన హత్యలతో తల్లి, భార్య, పిల్లలను కోల్పోయాడు. తనవారంటూ ఎవరూ లేని ఈలోకంలో ఒక కిరాతక హంతకుడిగా ఒంటరిగా మిగిలిపోయాడు. చెన్నైలో మంగళవారం విషాదాంతమైన ఒక వస్త్రవ్యాపారి జీవితం, నలుగురు దారుణ హత్యకు దారితీసింది.
సాక్షి, చెన్నై: వస్త్ర వ్యాపారంలో నష్టం వచ్చిందన్న విరక్తితో తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్యచేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఉదంతం చెన్నైలో మంగళవారం చోటుచేసుకుంది. చెన్నై పల్లవరం సమీపం పంబల్‌కు చెందిన దామోదరన్ అలియాస్ ప్రకాష్ (42) తన ఇంటి సమీపంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య దీప (36), కుమారుడు రోషన్ (7), కుమార్తె మీనాక్షి (5) ఉన్నారు. వీరితోపాటూ దామోదరన్ తల్లి సరస్వతి కూడా ఉంటున్నారు. పిల్లలిద్దరూ సమీపంలోని స్కూలులో చదువుకుంటున్నారు.
రుణదాతల నుంచి ఓత్తిళ్లు
దామోదరన్ తన వ్యాపారాభివృద్ధి కోసం పలువురి వద్ద అప్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. అందరితోనూ ఎంతో మంచిగా మెలిగే స్వభావం కావడంతో పలువురు అప్పులు ధారాళంగా ఇచ్చారు. అయితే ఆశించిన రీతిలో ఆయన వ్యాపారం అభివృద్ధి చెందలేదు. దీనికి తోడు అప్పుల భారం పెరిగి కనీసం వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ సహా అసలు సైతం ఇచ్చేయాలని రుణదాతల నుంచి ఒత్తిళ్లు మొదలైనాయి.
తీవ్రంగా కుంగుబాటుకు గురై..
దీంతో తీవ్రంగా కుంగుబాటుకు గురై గత నెలరోజులుగా ఎవరితో సరిగా మాట్లాడకుండా ఉండడాన్ని గమనించిన భార్య దీప భర్తను ప్రశ్నించగా, వ్యాపారం సరిగా జరగడం లేదు, అప్పులవారి ఒత్తిళ్లు తట్టుకోలేక పోతున్నా, ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోయాడు. ఈ నేపధ్యంలో సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన దామోదరన్ భార్య, పిల్లలను దగ్గర కూర్చునపెట్టుకుని సంతోషంగా గడిపాడు. ఆ తరువాత భార్యపిల్లలు నిద్రించగా ఆత్యహత్య చేసుకోవాలని భావించాడు.
అయితే తాను చనిపోతే అప్పుల వారు వారిని వేధిస్తారని, వారంతా అనాథలుగా మారిపోతారని ఆందోళన చెందాడు. ఆత్యహత్య అంటూ చేసుకుంటే కుటుంబంతో సహా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తన బావమరిది రాజాకు ఫోన్ చేసి...‘‘నేను చేసిన అప్పులు తీర్చలేక పోతున్నాను, నేను ఏమి చేస్తానో నాకే తెలియడం లేదు, ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నా’’ అంటూ ఫోన్ కట్ చేశాడు.
గొంతులు కోసేశాడు..
ఆ తరువాత వంటగదిలోకి వెళ్లి ఒక కత్తి తీసుకు వచ్చి భార్య నోటిని చేతితో అదుముతూ గొంతుకోశాడు. ఆ తరువాత తల్లి గదిలోకి వెళ్లి అదే తీరులో హతమార్చాడు. అలాగే కుమారుడు, కుమార్తె గొంతుకోశాడు. ఆ తరువాత తాను అదే కత్తితో గొంతు కోసుకున్నాడు. ఈ స్థితిలో దామోదరన్ బావమరిది ఫోన్‌చేస్తే ఎవరూ తీయకపోవడంతో అనుమానంతో హడావిడిగా అక్కడికి చేరుకున్నాడు. ఇల్లంతా రక్తపుమడుగులతో నిండిపోగా ఒక గదిలో అతని తల్లి, భార్య ప్రాణాలు విడిచిన స్థితిలో పడి ఉండగా, దామోదరన్, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో గిలగిల కొట్టుకుంటున్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్న ముగ్గురిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా పిల్లలిద్దరూ మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. దామోదరన్ చెన్నై జీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు రాసిన 5 పేజీల సూసైడ్ నోటు పోలీసుల చేతికి చిక్కింది. అందులో జీఎస్‌టీ కారణంగా అప్పుల పాలైనట్టు పేర్కొన్నాడు.
ఎంతో ఓదార్చా.. ఏం లాభం..
బావను ఫోన్‌లో ఎంతో ఓదార్చినా.. లాభం లేకపోయింద ని దామోదరన్ బావమరిది రాజా కన్నీరుమున్నీరయ్యా డు. ఆస్పత్రి వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తనకు దామోదరన్ ఫోన్ చేశాడని చెప్పారు. తాను ఇచ్చిన అప్పులు తీర్చకున్నా పర్వాలేదని, చెల్లి, పిల్లలు, మీరంతా బాగుంటే అంతేచాలు అని ఫోన్‌లోనే ఓదార్చానని తెలిపాడు. అయినా వినకుండా ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడని ఆవేదన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment