న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరాన్ని జూలై 3వరకు అరెస్ట్ చేయరాదని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. చిదంబరం తరఫు లాయర్లు దాఖలుచేసిన పిటిషన్‌ను గురువారం విచారించిన జస్టిస్ ఏకే పాఠక్ చిదంబరానికి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చారు. విచారణ కోసం సీబీఐ అధికారుల ముందు హాజరుకావాలని సూచించారు. ఈ కేసులో చిదంబరం దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని సీబీఐని ఆదేశించారు. అనంతరం తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేశారు. విచారణ సందర్భంగా సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ.. చిదంబరాన్ని కేవలం విచారణకు మాత్రమే పిలుస్తున్నందున ముందస్తు బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, గురువారం విచారణకు చిదంబరం హాజరుకాలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment