రాజ్యసభకు చిదంబరం, సిబల్, జైరాం | Chidambaram, Sibal, Jairam to the Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు చిదంబరం, సిబల్, జైరాం

Published Sun, May 29 2016 2:33 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాజ్యసభకు చిదంబరం, సిబల్, జైరాం - Sakshi

రాజ్యసభకు చిదంబరం, సిబల్, జైరాం

కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించిన సోనియా గాంధీ
 
 న్యూఢిల్లీ : రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.చిదంబరంను సోనియాగాంధీ శనివారం ఎంపిక చేశారు. సీనియర్ నేతలైన కపిల్ సిబల్, జైరాం రమేష్‌లకు ఉత్తరప్రదేశ్, కర్నాటక నుంచి అవకాశం కల్పించారు. అలాగే కర్ణాటక నుంచి ఆస్కార్ ఫెర్నాండేజ్, పంజాబ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ, ఛత్తీస్‌గఢ్ నుంచి ఛాయా వర్మ, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ టంఖా, ఉత్తరాఖండ్ నుంచి ప్రదీప్ టమ్టాలు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. కర్ణాటక నుంచి ఒక స్థానానికి మాత్రం ఇంకా ఎవరినీ నిర్ణయించలేదు. మహారాష్ట్ర నుంచి కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, మాజీ ఎంపీ బాలచంద్ర ముంగేకర్‌లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు.

ఏఐసీసీ కార్యదర్శి అవినాష్ పాండే పదవీకాలం ముగుస్తుండడంతో మహారాష్ట్రలో ఒక స్థానం ఖాళీ కానుంది. రాజ్యసభలో ఎన్డీఏను చిదంబరం, సిబల్, జైరాం రమేష్‌లు సమర్ధంగా ఎదుర్కొంటారనే ఆలోచనతో వీరిని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ఇక టంఖాకు సీనియర్ న్యాయవాదిగా మంచి పేరుండగా, టమ్టా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు సన్నిహితుడు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంబికా సోనీని తిరిగి ఎన్నిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే నిర్ణయించింది. ఆమె పంజాబ్ ఎన్నికల ప్రచార కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక చూస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో ఫెర్నాండేజ్ సభ్యుడు కావడంతో ఆయనకు అవకాశమిచ్చారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా చేసిన జైరాం భూ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు పలు అంశాల్లో ఎన్డీఏను విమర్శించడంలో ముందున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement