సోనియా ముందుచూపుతోనే రాష్ట్ర ఆవిర్భావం | Former Union Minister Chidambaram Slams TRS Govt | Sakshi
Sakshi News home page

సోనియా ముందుచూపుతోనేరాష్ట్ర ఆవిర్భావం

Published Thu, Nov 22 2018 2:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Former Union Minister Chidambaram Slams TRS Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తమ అధినేత్రి సోనియాగాంధీ ముందు చూపు వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రూ.2.20లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లిందనీ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం విమర్శించారు. కేసీఆర్‌ చేసిన వాగ్దానాలు ఆకాశంలోనూ, వాటి అమలు పాతాళంలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలిసారి చేసిన ప్రకటనను అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో చేశామని చిదంబరం వెల్లడించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఎన్ని పరిణామాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా డిసెంబర్‌ 9, 2009న చేసిన చారిత్రక ప్రకటనను నేను ఎన్నడూ మరిచిపోలేను.

తెలంగాణకు నా హృదయంలో ప్రత్యేక స్థానముంది. రాష్ట్ర ఏర్పాటులో మా అధినేత్రి సోనియాగాంధీకి ఉన్న ముందుచూపును, ఆ దిశగా ఆమె తీసుకున్న చొరవను ఎలా మరువగలం. ఈ ప్రకటనకు తెలంగాణ ప్రజలు తెలిపిన అపూర్వ స్పందనను మేము మరువలేం’ అని పేర్కొన్నారు. బుధవారం చిదంబరం గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో దళితులకు మూడెకరాల భూమి, గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 22 లక్షల డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు వంటి వేవీ అమలు చేయలేదన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని, నాలుగున్నరేళ్లలో రూ.2.20 లక్షలు కోట్లు అప్పు చేసి అప్పుల కుప్పగా చేశారన్నారు.  

బీజేపీ, టీఆర్‌ఎస్‌లది రహస్య ఒప్పందమే... 
ప్రస్తుత ఎన్నికల రణరంగంలో టీఆర్‌ఎస్‌ ఒకవైపు నిలిస్తే, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు మరోవైపు తలపడుతున్నాయన్నారు. ఈ పొత్తులు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణలకు అద్దం పడుతున్నాయన్నారు. ఇదే సమయంలో బీజేపీ కులం, మతం, భాష ప్రాతిపదికన విభజిస్తూ పాలిస్తోందన్నారు. తాము బీజేపీతో చేస్తున్నది మరో స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించారు. టీఆర్‌ఎస్‌ కొన్ని శక్తులతో రహస్యంగా చేతులు కలిపి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. బీజేపీపై పోరులో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలిసి రాలేదని, ఇది ఆ రెండింటి మధ్య ఉన్న రహస్య బంధాన్ని తేటతెల్లం చేస్తోందన్నారు. ప్రస్తుతం దేశ ఆర్ధిక పరిస్థితి సంక్షోభంలో పడిందని, ఇలాంటి సమయంలో భావ సారూప్యత కలిగి, బీజేపీపై పోరు చేసే పార్టీలతో జత కట్టడంలో తప్పేమీ లేదన్న చిదంబరం, అందులో భాగంగానే నాలుగు దశాబ్దాలుగా టీడీపీతో ఉన్న వైరాన్ని పక్కన పెట్టామన్నారు.  

స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని హరిస్తోంది.. 
కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలైన యూపీపీఎస్సీ, యూజీసీ, సీఈసీ, సీవీసీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకొని వాటిపై అజమాయిషీ చేస్తోందని ఆరోపించారు. కొత్తగా ఆర్బీఐ అధికారాల్లోకి కేంద్రం తలదూర్చుతోందని విమర్శించారు. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్‌ సామరస్యంగా పని చేసేవారమని, తాము ప్రతి వారం మాట్లాడుకునేవారని, ప్రతి నెలా కలుసుకునేవారమని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు సమావేశాల్లోనూ, ఇతర అనేక సందర్భాల్లో జరిగే సమావేశాల్లోనూ సన్నిహితంగా పని చేసేవారమని తెలిపారు. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేవని ఆరోపించారు. కేంద్రానికి సరైన ఆర్ధిక సలహాదారులే లేరని విమర్శించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement