భారమైన బాలలు...
♦ చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు
♦ కొనసాగుతున్న దురాచారం
♦ రెండేళ్లలో 10 వేలకు పైగా బాల్య వివాహాలు
♦ ఆర్థిక సమస్యలే ప్రధాన కారణం
పదోతరగతి పరీక్షలన్నీ విజయవంతంగా రాసిన ఉత్సాహంతో మానస (పేరు మార్చాం) ఇంటికొచ్చింది. అప్పటివరకు స్నేహితురాళ్లతో ఏ కాలేజీలో చేరదామనే అంశంపై ముచ్చట పెట్టింది. అదే ఆలోచనతో ఇల్లు చేరింది. వచ్చీరాగానే పట్నంలోని ఫలానా కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తానని చెప్పేలోపే ‘నీ చదువులిక చాలు. మంచి సంబంధం చూశా.. రేపు నిన్ను చూడడానికి వస్తున్నారు’ అని నాన్న చెప్పాడు. ఒక్కసారిగా మానసకు గుండె ఆగినంత పని అయ్యింది. ఆ మాటల నుంచి తేరుకునేలోపు ‘ముగ్గురు ఆడపిల్లలున్నారు కదా.. నీకు త్వరగా పెళ్లి చేస్తే కొంత భారం తీరుతుందమ్మా’ అని అమ్మ అనడంతో చేసేదేం లేక మానస పెళ్లికి సిద్దమైంది. మూడు ముళ్లు వేయించుకుని కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: పదిహేనేళ్లలోపు పెళ్లి.. నిండా పదహారేళ్లు రాకముందే చంకన బిడ్డ.. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు.. ఇదీ బాల్యవివాహాల తాలూకు ఫలితాలు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా బాల్యవివాహాలు జరుగుతున్నాయి. రెండేళ్లలో రాష్ట్రంలో 2,189 బాల్య వివాహాలను మహిళా, విశు సంక్షేయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇవికాకుండా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పెళ్ళిళ్లు 10 వేలకు పైగా ఉంటాయని అంచనా. వీటిని అరికట్టేందుకు ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చినప్పటికీ ముక్కుపచ్చలారని వయస్సున్న బాలికల మెడలో పసుపుతాళ్ళు పడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
గిరిజన ప్రాంతాల్లో అధికం...
పేదరికం, నిరక్షరాస్యత, దానికితోడు ఆడపిల్లలున్న కుటుంబాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నట్లు పలు స్వచ్ఛంధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది ఆడపిల్లలున్న కుటుంబంలో పెద్దమ్మాయి పెళ్లిని పదిహేనేళ్లలోపే చేస్తున్నారు. అలాగే గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోనూ ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. పాత జిల్లాల ఆధారంగా బాల్యవివాహాల తీరుపై ఇటీవల మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధ్యయనం చేసింది. క్షేత్రస్థాయిలో సమాచా రాన్ని సేకరించిన అధికారులు.. వాటిని క్రోడీకరించి జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించింది.
ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాల్లో బాల్యవివాహాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. వీటిని అరికట్టేందుకు 2006లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు చురుకుగా పనిచేసి చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి. బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం అందితే వెంటనే ఆ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు ఆ వివాహాన్ని నిలిపివేయాలి.
ఇలా రెండేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2,189 బాల్య వివాహాలను అధికారులు ఆపగలిగారు. ఇందులో అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1,132 వివాహాలను నిలిపివేయడం గమనార్హం. ఇవన్నీ అధికారుల దృష్టికి వచ్చినవే. కానీ ఇవిగాకుండా లోలోపల జరిగే బాల్యవివాహాల సంగతి చెప్పనక్కర్లేదు. కొన్ని వివాహాలకు సంబంధించి అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. వారొచ్చే లోపే పెళ్ళిళ్లు కానిచ్చేస్తున్నారు. దీంతో చేసేదేం లేక అధికారులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరగుముఖం పడుతున్నారు.
చిన్న వయసులో అమ్మ...
వివాహ చట్టాల ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండాలి. నిర్దేశిత వయస్సు దాటిన తర్వాతే పెళ్లి చేయాల్సి ఉంది. కానీ అమ్మాయిల్లో ఎక్కువగా 15 ఏళ్లు రాగానే పెళ్లి చేసేస్తున్నారు. దీంతో పదహారు, పదిహేడేళ్ల లోపే చంటిబిడ్డతో కనిపిసు ్తన్నారు. పిన్నవయసులో తల్లులు కావడంతో అమ్మాయి ల్లో తీవ్ర ఆనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. చిన్నత నంలో గర్భం దాల్చడంతో శిశువు ఎదుగుదలపై దుష్ప్రభావాలు చూపుతాయి. దీంతో పుట్టే శిశువు పలు ఆరోగ్య లోపా లుండడంతో ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడనుంది. అదేవిధంగా తల్లుల్లో రక్తహీనతతో పాటు పలు సమస్యలు వస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.
పత్తా లేని వివాహ రిజిస్ట్రేషన్...
వివాహ చట్టం ప్రకారం ప్రతి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఇందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే వెళ్లనక్కర్లేదు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి ఇచ్చే ధ్రువీకరణ పత్రం తీసుకున్నా రిజిస్ట్రేషన్ చేయించినట్లే. కానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అంతగా స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునే వారు మినహా మిగతా పెళ్ళిళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయడంపై అధికారులు పెద్దగా శ్రద్ద చూపకపోవడంతో ఈ పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది.