
న్యూఢిల్లీ: ఢిల్లీలోని విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 45 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నట్లు సీఐఎస్‌ఎఫ్ బలగాలు బుధవారం చెప్పాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్–3 వద్దకు మంగళవారం సాయంత్రం వచ్చిన మురాద్ అలీ (25) అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడంతో అధికారులు అతడి లగేజీని తనిఖీ చేశారు. దుబాయ్‌కు వెళ్లనున్న అతడి దగ్గర బిస్కెట్ ప్యాకెట్లు, పల్లీలు, ఉడికించిన మాంసపుముద్దలు ఉన్నాయి.
అధికారులు వాటిని తెరచి చూడగా అందులో చిన్నగా చుట్టిన విదేశీ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 508 నోట్లు ఉన్నాయని, వాటి విలువ భారత కరెన్సీలో రూ. 45 లక్షలు ఉంటుందని చెప్పారు. వేరుశనక్కాయల పైపొరను పగులగొట్టి అందులో నోట్లను ఉంచి, దాన్ని మళ్లీ జిగురుతో అంటించినట్లు కనుగొన్నారు. బిస్కెట్ ప్యాకెట్‌లో ప్రతి బిస్కెట్ తర్వాత ఓ నోటును ఉంచి ఆపై దాన్ని సీల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ కరెన్సీని కస్టమ్స్ అధికారులకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మురాద్ ఇప్పటికే పలుమార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment