
ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, గోరఖ్‌పూర్ : తరగతి గదుల్లో విద్యార్థులను పాఠశాల యాజమాన్యాలు, అధ్యాపకులు ఎంత ఒత్తిడిలోకి నెడుతున్నాయో.. చెప్పే ఘటన తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. అసంబంద్దంగా, అనవసరంగా టీచర్లు చిన్నారులను శిక్షించే విధానానికి ఇది పరాకాష్ట అని చెప్పుకోవాలి. తరగతి గదిలో తప్పు చేయకపోయినా..టీచర్ తీవ్రంగా మందలించడంతో.. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక సెయింట్ ఆంథోని స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న నవనీత్ (11)ను సెప్టెంబర్ 15న స్కూల్లో టీచర్ తీవ్రంగా దండించారు. టీచర్ అందరిముందు తప్పులేకపోయినా మందలించడంతో ఆవేదన చెందిన విద్యార్థి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. నవనీత్ బాగా చదువుతాడని.. పరీక్షల్లో ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవని విద్యార్థి తండ్రి రవిప్రకాష్ వెల్లడించారు.
నవనీత్ మృతికి స్కూల్ టీచర్ ప్రవర్తనే కారణం అని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందుకు నవనీత్ రాసిన సూసైడ్ నోట్‌ను ఆధారంగా వారు చూబుతున్నారు. నవనీత్ రాసిన సూసైడ్ నోట్‌లో... ’నాలాగా మరో విద్యార్థిని మీరు.. మీ మాటలతో హింసించకండి.. మమ్మల్ని నమ్మండి.. మేం బాగా చదువుతాం‘ అని నవనీత్ రాశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు స్కూల్ స్కూల్ టీచర్ జోసెఫ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.