మైనింగ్‌ కోసం దేవుళ్లు కూడా మాయం! | A Clear Way For Mining | Sakshi
Sakshi News home page

మైనింగ్‌ కోసం దేవుళ్లు కూడా మాయం!

Published Wed, Jun 26 2019 4:27 PM | Last Updated on Wed, Jun 26 2019 8:30 PM

A Clear Way For Mining - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో ఉండేవారంతా ఆదివాసులే. వారు అక్కడి పర్వత శ్రేణిని నందరాజ్‌ కొండలు అని పిలుచుకుంటారు. నందరాజ్, ఆయన భార్య పితోర్మేట ఆదివాసీల దేవుళ్లు. అక్కడి 84 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలు పితోర్మేటను ఎక్కువగా ఆరాధిస్తున్నారు. ఆమె పేరిట పలు ఉత్సవాలు నిర్వహిస్తారు. గోంచా, హరియేలి, కోరా, నవఖని, చెర్తా ప్రధానంగా అక్కడి ఆదివాసీలు నిర్వహించే ఉత్సవాలు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం అక్కడి ఆదివాసీలకు ఎలాంటి ఉత్సవాలు లేవు. వారికంటూ ఓ ప్రత్యేక సంస్కతి కూడా లేదు. డాక్యుమెంట్ల ప్రకారం పితోర్మేట కొండల్లో 13 ఖనిజ నిక్షేపాలు, వాటిల్లో 32.60 కోట్ల టన్నుల ప్రథమ శ్రేణి ఇనప ఖనిజాలు ఉన్నాయి.

వాటిల్లో నుంచి కోటి టన్నుల ఇనప ఖనిజాలను వెలికి తీసే హక్కులను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ హయాంలోని జాతీయ ఖనిత అభివద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)కి అప్పగించింది. కాని పనులేమి జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం హయాంలోని చత్తీస్‌గఢ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో కలిసి ఓ ప్రైవేటు కంపెనీ ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ కంపెనీకి 2017లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మైనింగ్‌ హక్కులను కేటాయించింది. ఆ జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఆ హక్కులను తీసుకెళ్లి ‘అదాని ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌’కు 2018, సెప్టెంబర్‌లో కేటాయించింది. ఆ తర్వాత రెండు నెలలోపే అంటే, 2018, డిసెంబర్‌ నెలలో  క్షేత్రస్థాయి పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పనులు ఎందుకు ఆగిపోయాయి ?
అప్పటి నుంచి చకా చకా మైనింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. లక్షలాది చెట్లను కొట్టివేశారు. మట్టి రోడ్లు వేసి చదును చేశారు. ఖనిజాలను తరలించేందుకు కన్వేయర్‌ బెల్ట్‌ పనులు కూడా చేపట్టారు. అప్పటికి ఐక్యమైన ఆదివాసీలు మైనింగ్‌ పనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ‘మా భూములపై మీకు హక్కు ఎవరిచ్చారు ?’ అంటూ నిలదీశారు. రాస్తో, రోకోలు, ధర్నాలు చేశారు. ఫలితంగా చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ జూలై ఆరవ తేదీన మైనింగ్‌ పనులను నిలిపివేశారు. ఆదివాసీల గ్రామ సభ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ తీర్మానం చేసినట్లు హిరోలి గ్రామ సర్పంచ్, 106 మంది గ్రామస్థులు సంతకాలు చేసి వేలి ముద్రలు వేశారంటూ అధికారులు చూపిస్తున్న డాక్యుమెంట్‌ నకిలీదని, అలాంటి గ్రామ సభనే తాము నిర్వహించలేదని, తాము ప్రాణాలైనా అర్పిస్తాంగానీ, అలాంటి తీర్మానం చేయమని సర్పంచ్‌తో సహ హిరోలి గ్రామస్థులంతా స్పష్టం చేయడంతో ఆ డాక్యుమెంట్‌పై చత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి దంతేవాడ సబ్‌ డివిజన్‌ మేజిస్ట్రేట్‌ దర్యాప్తునకు ఆదేశించారు.

2014, జూలై 4వ  తేదీతో డాక్యుమెంట్‌
రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రాంతంలో చేపట్టే మైనింగ్‌ ప్రాజెక్ట్‌కు అనుమతిస్తూ హిరోలి గ్రామం జూలై 4, 2014న గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానించినట్లు ఆ డాక్యుమెంట్లో ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పారిశ్రామిక, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ‘పంచాయత్స్‌ (ఎక్స్‌టెన్షన్‌ టు షెడ్యూల్‌ ఏరియాస్‌) యాక్ట్‌’ కింద గ్రామ సభ అనుమతి తప్పనిసరి. తాము సంతకాలు చేసినట్లు అధికారులు చూపిన కాగితంపై ఉన్నవి తమ సంతకాలు, వేలి ముద్రలు కావని హిరోలి సర్పంచ్, బుధ్రి, ఆమె భర్త భీమారామ్‌ కుంజం, మాజీ సర్పంచ్‌ జోగా కుంజం, గ్రామస్థులు మీడియాకు స్పష్టం చేశారు. ఈ విషయమై తాము జనవరి 9వ తేదీనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు.

అదంతా దంతెవాడ జిల్లా కలెక్టర్‌ పని
గ్రామ సభ అనుమతి ఉన్నట్లు అప్పుడు సంతకాలు, వేలి ముద్రల డాక్యుమెంట్‌ రూపొంచినప్పుడు దంతెవాడ జిల్లా కలెక్టర్‌గా కేసీ దేవ్‌సేనాపతి ఉన్నారు. ఆయన ప్రస్తుతం ‘స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ జియాలోజి అండ్‌ మైనింగ్‌’తోపాటు ‘మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ చత్తీస్‌గఢ్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. డాక్యుమెంట్‌ వివాదం గురించి మీడియా ఆయన వివరణ కోరగా, విషయం కోర్టులో ఉన్నందున తానేమీ మాట్లాడనని చెప్పారు.

రాజ్యాంగంలోని 244 అధికరణ ఉల్లంఘన
ఆదివాసీలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న 244వ అధికరణను అధికారులు ఉల్లంఘించినట్లు కనిపిస్తోంది. ఆదివాసీల స్థలాలను ఇతరులకు అమ్మరాదు, కొనరాదు. ప్రభుత్వ పథకాలకు గ్రామసభల అనుమతి తప్పనిసరి. గ్రామ సభల అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు చేపట్టే భూములకు సామాజిక, సాంస్కతిక, మతపరమైన ప్రాముఖ్యతలు ఉండరాదు. ఇవేమీ లేవంటూ చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవుల శాఖ ప్రాంతీయ కార్యాలయం ‘ఫారెస్ట్‌ అడ్వజరీ కమిటీ’కి 2016, జూలై 8న సమర్పించిన ‘సైట్‌ ఇన్‌స్పెక్షన్‌’ నివేదికలో పేర్కొంది. కానీ ఆదివాసీలు పంట కోతకు వచ్చినప్పుడే కాకుండా దేవుళ్ల పేరిట పలు వేడుకలు స్థానికంగా నిర్వహిస్తుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement