
ఇకపై రోజువారీ రేట్లు!
అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా వచ్చే నెల 1 నుంచి ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారే అవకాశముంది.
ప్రతిరోజూ మారనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
► ప్రయోగాత్మకంగా దేశంలోని ఐదు నగరాల్లో అమలు
► విశాఖతోపాటు పుదుచ్చేరి, ఉదయ్‌పూర్, జంషెడ్‌పూర్, చండీగఢ్‌లో
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా వచ్చే నెల 1 నుంచి ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారే అవకాశముంది. దేశంలో 95 శాతం పెట్రోల్ పంపులు కలిగియున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లు దేశంలోని ఐదు నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీనిని అమలు చేయనున్నాయి.
అనంతరకాలంలో ఫలితాలను సమీక్షించి ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయడంపై నిర్ణయం తీసుకుంటారు. ఐవోసీ చైర్మన్ బి.అశోక్ మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు మార్కెట్ ధరలకు అనుగుణంగా రోజువారీ మార్పులవైపు ముందడుగు వేస్తున్నాం. ఈ విధానాన్ని ముందుగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో పాటు పుదుచ్చేరి, రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, చండీగఢ్‌లలో అమలుచేయనున్నాం. రోజువారీ చమురు ధరల మార్పు విధానం సాంకేతికంగా సాధ్యమే.
పైలట్ ప్రాజెక్టు సఫలమైతే, దీనిని దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశముంది. నెల రోజుల్లో ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తాం..’ అని తెలిపారు. అయితే కచ్చితమైన తేదీని మాత్రం ఆయన చెప్పలేదు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మే 1 నుంచి దీనిని ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకు అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా 1, 16 తేదీల్లో సవరించిన రేట్లను ప్రకటిస్తుండేవి. అయితే రోజువారీ ధరల సమీక్ష వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో భారీ హెచ్చుతగ్గులు చోటుచేసుకోబోవు. అలాగే అన్ని ప్రభుత్వరంగ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ఒకే ధర అమల్లో ఉంటుందని ఐవోసీ చైర్మన్ అశోక్ చెప్పారు.