
నువ్వో కాంగ్రెస్ చెంచావి!
బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విట్టర్‌లో కత్తులు దూసుకున్నారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్విట్టర్‌లో కత్తులు దూసుకున్నారు. నువ్వో సంఘ్ భావజాలమున్న హిందూవి అని ఖేర్‌ను థరూర్ విమర్శిస్తే.. 'నువ్వో కాంగ్రెస్ చెంచావి' అంటూ థరూర్ పై ఆయన విరుచుకుపడ్డారు. శశి థరూర్ శనివారం ఖేర్ ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో లింకును ట్విట్టర్‌లో పోస్టు చేసి.. 'అనుపమ్, నేను హిందువునని గర్వంగా అన్ని సమయాల్లో చెప్పుకొంటాను. కానీ సంఘ్ భావజాలమున్న హిందుని కాదు' అని ట్వీట్ చేశారు.
దీనిపై అనుపమ్ ఖేర్ తీవ్రంగా మండిపడ్డారు. 'శశీ.. నువ్వు కూడా మిగతావారిలాగా నా వ్యాఖ్యలను వక్రీకరించి.. కాంగ్రెస్ చెంచాలాగా వ్యవహరిస్తావని అనుకోలేదు' రీట్వీట్ చేశారు. దీనికి స్పందించిన థరూర్ వాదనలో ఓడిపోయినప్పుడే దుర్భాషలకు దిగుతారని, తాను కాంగ్రెస్ ఎంపీగా గర్వపడతానని, తాను ఎవరినీ అవమానించనని పేర్కొన్నారు. ఖేర్ మళ్లీ స్పందిస్తూ థరూర్ మొదట హిందూ, సంఘీ పేరిట ఈ వివాదానికి తెరతీశారని వివరణ ఇచ్చారు.
అనుపమ్ ఖేర్‌కు పద్మభూషణ్ అవార్డు రావడంపై ట్విట్టర్‌లో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. 2010లో పద్మ అవార్డుల ప్రామాణికతను ప్రశ్నించిన ఆయన ఎలా ఈ పురస్కారాన్ని తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై ఖేర్ తీవ్రంగా స్పందించారు.