శశిథరూర్ చేసిన వివాదాస్పద ట్వీట్
సాక్షి వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ శనివారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన భారతదేశ చిత్రపటం వివాదాస్పదమైంది. ఆయన పోస్ట్ చేసిన చిత్రపటంలో పీఓకే లేదు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు ట్విటర్‌లో ఆయన వైఖరిని ఎండగడుతున్నారు. వివరాలు.. ‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రేపు (ఆదివారం) కేరళలోని కోజికోడ్‌లో జరగనున్న ర్యాలీకి నాయకత్వం వహిస్తూ, ఈ నిరసనల్లో నేను మొదటి సారిగా పాల్గొంటున్నాను. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే’.. అంటూ దేశ చిత్రపటంతో సహా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే చిత్రపటంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన నెటిజన్లు ఆయన తీరును విమర్శించారు. ఒకరు ‘చాచా నెహ్రూ, ఇందిరా గాంధీలు కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు బహుమతిగా ఇచ్చేశారు కాబట్టి కశ్మీర్ పాక్‌తోనే ఉండాలని వారు (కాంగ్రెస్) కోరుకుంటున్నార’ని ఎద్దేవా చేశారు.
మరొకరు ‘శశిథరూర్ చెప్పింది నిజమే. మనం మన దేశాన్ని రక్షించుకోవాలి. ఇలాంటి డర్టీ మైండ్‌సెట్ ఉన్న వాళ్లతో మన దేశాన్ని నిజంగా కాపాడుకోవాలి’ అని విమర్శించారు. ఇంకొకరు ‘సరైన దేశ చిత్ర పటాన్ని ఉంచలేని నీలాంటి మేధావుల బారి నుంచి దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది అనుకోకుండా జరిగిన లోపం కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగింది. మిస్టర్ థరూర్! దేశం మిమ్మల్ని గమనిస్తోందం’టూ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ.. మీరు, మీ పార్టీ కార్యకర్తలు తరచూ ఇలాంటి చిత్రపటాన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దేశాన్ని వక్రీకరించడం, విభజించడం, నాశనం చేయడమే కాంగ్రెస్ విధానమా? ఇలాంటి పని చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలా? వద్దా? అని ప్రశ్నించారు. కాగా, నెటిజన్ల నుంచి విమర్శలు వస్తుండడంతో శశిథరూర్ తన ట్వీట్‌ను తర్వాత తొలగించారు. చదవండి : శశిథరూర్‌కు కేంద్ర సాహిత్య పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment