టీఆర్‌ఎస్ నాయకులతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల్లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్‌లో సాయుధ బలగాల తిరుగుబాటును
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ నాయకులతోపాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా రాష్ట్ర పోలీసుల్లో ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్‌లో సాయుధ బలగాల తిరుగుబాటును ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నారని సీమాంధ్రకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రాంతీయతత్వాన్ని, తిరుగుబాటును రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల నుండి 14ఎఫ్ తొలగించడంతో ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులలో 1973 నాటి షట్సూత్ర పథకాన్ని, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాంతాలవారీగా పోలీసుల్లో తిరుగుబాటును రెచ్చగొట్టే ప్రయత్నాలు అత్యంత తీవ్రమైన దుష్పరిణామాలకు దారితీయవచ్చునని ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, డాక్టర్ కె.వి.పి.రామచంద్రరావు, ఎ.సాయిప్రతాప్‌లు లేఖలో హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోలు నిర్వహించిన బహిరంగసభను అడ్డుకొనేందుకు అన్ని విధాలా ప్రయత్నించిన వేర్పాటువాదులు... ఉద్యోగులు రాజధానికి వస్తున్నప్పుడు, తిరిగి వెళ్తున్నప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. శనివారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బహిరంగ సభాస్థలికి సమీపంలోని అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రజలు సభకు హాజరవకుండా భయపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బహిరంగసభ జరిగిన ఎల్బీ స్టేడియం బయట విధులు నిర్వహించాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ లోనికి చొరబడి వేదిక సమీపంలో జై తెలంగాణ నినాదాలు చేయడం ద్వారా ప్రశాంతంగా జరుగుతున్న సభను చెడగొట్టే ప్రయత్నం చేశాడని దిగ్విజయ్ దృష్టికి తెచ్చారు. ఈ కానిస్టేబుల్ ప్రవర్తనను కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా సమర్థించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రం విడిపోకముందే సీమాంధ్రుల పరిస్థితి ఇలా ఉంటే విభజన తర్వాత ప్రజల ప్రజాస్వామిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛ పరిస్థితి ఎంత అధ్వానంగా తయారవుతుందో అర్థం చేసుకోవచ్చునని వారు పేర్కొన్నారు.