లక్నో : సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహించే వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రియాంక పడవలో ప్రయాణిస్తూ ప్రచారాన్ని హోరెత్తించేలా కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈనెల 18 నుంచి 20 వరకూ ప్రియాంక వారణాసిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 18న ప్రయాగరాజ్ చేరుకునే ప్రియాంక అక్కడి నుంచి పడవలో వారణాసి వరకూ ప్రయాణిస్తారు.
కాగా ప్రియాంక బోట్ ప్రయాణానికి అనుమతి కోరుతూ యూపీ కాంగ్రెస్ నేతలు ఈసీ అధికారులను కలిశారు. ఎన్నికల షెడ్యూల్ అనంతరం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఈ ప్రచారం చేపడతామని ఈసీకి కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మూడు రోజుల పాటు బోట్‌లో ప్రయాణించనున్న ప్రియాంక తన పడవ ప్రయాణంలో పలు చోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ వైఫల్యాలే లక్ష్యంగా ఆమె ప్రచార పర్వాన్ని వేడెక్కించనున్నారు.
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆమెను వారణాసి నుంచి పోటీ చేయాలని పార్టీ శ్రేణులు కోరుతుండగా, యూపీలో కాంగ్రెస్ ఇప్పటివరకూ ప్రకటించిన 27 మంది అభ్యర్ధుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం గమనార్హం. యూపీలో డీలాపడిన కాంగ్రెస్‌కు పునర్‌వైభవం తెచ్చేందుకు ప్రియాంక చెమటోడుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment