
భూపీందర్ సింగ్ హూడా
చండీగఢ్: హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న అధికార కాంగ్రెస్ ఈ నెల 15న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బుధవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఇందులో రైతులతోపాటు పలు వర్గాలు ప్రజలకు తాయిలాలు ప్రకటించింది. రాష్ట్రాన్ని అభివద్ధి పథంలో పరుగులు తీయిస్తామని హామీ ఇచ్చింది. పంచకులలో సీఎం భూపీందర్ సింగ్ హూడా, కాంగ్రెస్ రాష్ట్ర బాధ్యుడు షకీల్ అహ్మద్ తదితరులు దీన్ని సంయుక్తంగా విడుదల చేశారు. స్వల్పకాలిక రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన రైతుల వడ్డీని పూర్తిగా, దీర్ఘకాలిక రుణాలను చెల్లించిన రైతుల వడ్డీని సగం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
రైతులకు రుణ పరిమితిలో పారిశ్రామికవేత్తల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని పాటిస్తామని పేర్కొన్నారు. భూసేకరణ విధానాన్ని హేతుబద్ధీకరించి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. బంగాళాదుంపలు, ఉల్లి తదితర పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని స్థాపిస్తామన్నారు. హర్యానాకు ప్రత్యేక హైకోర్టు సాధన కోసం ఇకముందూ ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతలో కనీసం సగం మందికి ప్రైవేటు ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మహిళలకు ప్రత్యేక బ్యాంకులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
**