'మేం ఒంటరిగానే బరిలోకి..'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీతరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్ చెప్పారు. ఏ ఒక్కపార్టీతో పొత్తుపెట్టుకోబోమని అన్నారు. 2017లో జరిగే ఈ ఎన్నికల్లో ఫలితాలు ప్రతి ఒక్కరని అబ్బురపరుస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పక ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అయితే, మీరు ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని షీలా చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు ఇప్పటికే బీజేపీ, సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ వాది పార్టీల పాలనను చూశారని ఇప్పుడు వారంతా గొప్ప ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకెళ్లి వారి మద్దతు పొందుతామని చెప్పారు. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పరిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని, మతం పేరిట దాడులు పెరిగాయని ఆరోపించారు.