'రేప్లు ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను తప్పుబట్టారు. నగరంలో యువతులపై, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని అన్నారు. ఢిల్లీలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడిపట్ల ఆమె స్పందిస్తూ..
'ముందుగా ఈ విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. బాలికలు, యువతులపై లైంగికదాడులు జరగడమనేది ఏ ప్రభుత్వానికైనా సిగ్గుచేటే. ఇప్పుడు ఢిల్లీ పాలనకు సంబంధం లేని ప్రధాని నరేంద్రమోదీని ఈ ఘటనలపట్ల బాధ్యుడిగా చేసి మాట్లాడటం మరింత విచారకరం. కేజ్రీవాలే కాదు.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టినా పోలీసు వ్యవస్థ వారి ఆధ్వర్యంలో ఉండనిదని తెలిసిన విషయమే. అందుకే, వెంటనే పోలీసు వ్యవస్థను ఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలి. వీవీఐపీలకు, రాయబారులకు ముందస్తు భద్రతకు, ఢిల్లీలో శాంతి భద్రతలకు ప్రత్యేక పోలీసు దళం తప్పక అవసరం' అని ఆమె చెప్పారు.