సంగీతానికి కూడా సంకెళ్లా ‘కృష్ణా’! | Controversy Over Cancellation Of TM Krishna Concert | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 16 2018 3:23 PM | Last Updated on Fri, Nov 16 2018 4:37 PM

Controversy Over Cancellation Of TM Krishna Concert - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, మెగసెసే అవార్డు గ్రహీత టీఎం కృష్ణ శనివారం, ఆదివారం ఢిల్లీలో ఇవ్వాల్సిన సంగీత విభావరిని నిర్వాహకులు అనూహ్యంగా రద్దు చేశారు. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీ చాణక్యపురి ప్రాంతంలోని నెహ్రూ పార్క్‌లో స్పిక్‌–మాకే అనే సాంస్కృతిక సంస్థతో కలిసి స్పాన్సర్‌ చేయాలని ‘భారత ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ (ఏఏఐ)’ నిర్ణయించింది. అందుకు తగినట్లుగా పార్క్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యవసర పనుల కారణంగా ఈ సంగీత కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని, ప్రేక్షకులను నిరుత్సాహ పరచినందుకు చింతిస్తున్నామని ఆ తర్వాత ఏఏఐ అధికారికంగా ట్వీట్‌ చేసింది. ఈ విషయమై మీడియా ముందు పెదవి విప్పేందుకు ఏఏఐ అధికారులు నిరాకరించారు. అధికారంలో ఉన్న శక్తుల ఒత్తిళ్ల మేరకు కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందా? అంటూ పదే పదే ప్రశ్నించగా అలాంటిదే కావచ్చు అని సూచన ప్రాయంగా అంగీకరించారు. వారి పేర్లను బహిర్గతం చేయడానికి కూడా వారు నిరాకరించారు.

ఏఏఐ నవంబర్‌ 9వ తేదీన పంపించిన ఆహ్వాన ట్వీట్‌లో ఈ రెండు రోజుల సంగీత మహోత్సవంలో టీఎం కృష్ణ కచేరి ప్రధాన ఆకర్షణగా పేర్కొన్నారు. దాంతో ఆరెస్సెస్‌ మొదలుకొని దాదాపు అన్ని హిందూ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. టీఎం కృష్ణను ‘అర్బన్‌ మావోయిస్టు, యాంటీ ఇండియా, మతం మార్చుకున్న పెద్ద మనిషి’గా అభివర్ణించారు. అలాంటి వ్యక్తి కోసం ఎందుకు ప్రజా సొమ్మును వృధా చేస్తారు అని కూడా హిందూ శక్తులు ప్రశ్నించాయి. ఆ రోజున టీఎం కృష్ణ కార్యక్రమం ఉండడానికి వీల్లేదంటూ రైల్వే, బొగ్గు, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి పియూష్‌ గోయల్, పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభులకు ట్యాగ్‌ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ కారణంగా పెద్దల ఒత్తిళ్లతోనే టీఎం కృష్ణ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రి మనిష్‌ సిసోడియా స్వయంగా వెళ్లి కృష్ణను కలుసుకుని తాము కార్యక్రమాన్ని స్పాన్సర్‌ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.

అందుకు కృష్ణ ఏం చెప్పారో తెలియదుగానీ మీడియా ముందుకు వచ్చిన కృష్ణ మాత్రం ‘ఇదేం ప్రజాస్వామ్యమండి! వారికిష్టం లేకపోతే అర్బన్‌ నక్సలైట్‌ అని, యాంటీ ఇండియా అని, ప్రెస్టిట్యూట్‌ అని ముద్ర వేస్తారు. వారు మమ్మల్ని భయపెడతారు. మాకు వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొడతారు. సంగీతానికి కూడా సంకెళ్లు వేస్తారా?’ అని వ్యాఖ్యానించి ఆయన కోపంగా నిష్క్రమించారు. టీఎం కృష్ణ 2008 నుంచే ప్రసిద్ధ గాయకుడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కచేరీలు ఇచ్చారు. పలు అవార్డులతోపాటు 2016లో మెగసెసే అవార్డును స్వీకరించారు. ఓ అగ్రకుల ఆధిపత్యం నుంచి కర్ణాటక సంగీతం విముక్తి పొందాలని, సంగీతానికి కుల, మతాలు లేవని వాదించే టీఎం కృష్ణ ఓ సామాజిక కార్యకర్త కూడా.

స్వయాన తమిళ బ్రాహ్మణ కులానికి చెందిన టీఎం కృష్ణ ఏసు క్రీస్తు మీద, అల్లా మీద కూడా పాటలు పాడడం హిందూ శక్తులకు కోపం. గతంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై హిందూ శక్తులు చేయి కూడా చేసుకున్నాయి. సమాజంలో సమాన హక్కుల కోసం హిజ్రాల పోరాటానికి సంఘీభావంగా ఆయన వారితో కలిసి కచేరీ కూడా ఇచ్చారు. ‘పోరంబోకు’ లాంటి ఆయన పాటలు విన్నవాళ్లు ఆయన్ని ‘ప్రకృతి కవి’గా అభివర్ణిస్తారు. ప్రకృతిని ప్రేమించే అడవులను ఆదరించే వ్యక్తిగా ఆయన్ని ‘బలమైన ప్రకృతి శక్తి’గా ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ అభివర్ణించారు. ఆయన పూర్తిపేరు తోడూరు మాడబూషి కృష్ణ. ఆయన తండ్రి టీఎం రంగాచారి కూడా సంగీతంలో పట్టభద్రుడే కాకుండా దళిత పిల్లల కోసం ఓ పాఠశాలను కూడా నిర్వహించారు.
(ఎవరు అడ్డుపడినా సరే శనివారం సాయంత్రం ఢిల్లీలో తన కచేరి కొనసాగుతుందని టీఎం కష్ణ కాస్త ఆలస్యంగా నిర్ధారించారు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement