స్మార్ట్ సిటీల అభివృద్ధికి సింగపూర్ సహకారం
విదేశాంగ మంత్రి సుష్మ వెల్లడి
సింగపూర్: దేశంలో ‘స్మార్ట్ సిటీ’ల అభివృద్ధికి భారత ప్రభుత్వం సింగపూర్ సహకారం తీసుకోనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో 100 స్మార్ట్ సిటీల అభివృద్ధి కోసం రూ. 7,060 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ శనివారం సింగపూర్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రి లీ హెసీన్ లూంగ్, విదేశాంగ మంత్రి కె.షణ్ముగంతో సహా పలువురు ముఖ్య నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. భారత్ - సింగపూర్‌ల మధ్య దౌత్య సంబంధాలు నెలకొల్పుకుని 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది నిడివి ఉత్సవాలను షణ్ముగంతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సుష్మా మాట్లాడుతూ.. భారత్‌లో సింగపూర్ సంస్థలు అనుసంధాన, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. ప్రత్యేకించి ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్, చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లతో పాటు ఈశాన్య ప్రాంతంలోని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కారిడార్‌లో ఎక్కడోచోట ‘లిటిల్ సింగపూర్’ను అభివృద్ధి చేయవచ్చన్నారు. సుష్మా పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలతో పాటు భారత్‌లో స్మార్ట్ సిటీల అభివృద్ధికి సహకారంపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. పట్టణ ప్రణాళికారచన, నీటి నిర్వహణ వ్యూహాలు తదితర రంగాల్లో సింగపూర్ సహకారం అందించనుంది. సుష్మ సింగపూర్‌లో పర్యటనలో భాగంగా ఆర్థిక, రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరు దేశాలూ అవగాహనకు వచ్చాయి.