కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ మందు బాబుల్ని గిలగిలా గింజుకునేలా చేస్తోంది. మద్యం దొరక్క నీళ్లల్లో స్పిరిట్ కలుపుకుని తాగే వాళ్లు కొందరైతే, షేవింగ్ లోషన్లను శీతల పానీయాల్లో కలుపుకుని తాగేవాళ్లు మరి కొందరు. మతిలేని చేష్టలు కాస్తా వారిని మరణం అంచుకు తీసుకెళ్తున్నాయి. శనివారం పుదుకోట్టైలో సేవింగ్ లోషన్‌ను శీతల పానీయంలో కలుపుకుని తాగిన ముగ్గురిలో ఇద్దరు విగతజీవులయ్యారు. మరొకరు తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సాక్షి, చెన్నై: రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ నేతృత్వంలో ప్రభుత్వమే మద్యం విక్రయాలను సాగిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 5300 మద్యం దుకాణాలు, నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు బార్లు వెలిసి ఉన్న విషయం తెలిసిందే. వీటి ద్వారా రోజుకు ఆదాయం వందకోట్ల మేరకు ఉంటుంది. శని, ఆదివారాలు, పండుగ సమయాల్లో రెట్టింపు అవుతాయి. తొలుత, రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు 31వ తేదీ వరకు అని ప్రకటించడంతో వారానికి సరిపడా మద్యాన్ని ముందు జాగ్రత్తగా మందుబా బులు సిద్ధం చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్‌ను ఈ నెల 14 వరకు అంటూ 21 రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో మందు బాబులకు సంక్లిష్ట పరిస్థితులు తప్పలేదు.
నాటు సారా జోరు
టాస్మాక్ మద్యం దుకాణాల మూతతో మందుబాబులు మద్యం కోసం తల్లడిల్లుతున్నారు. బ్లాక్‌లో మద్యం విక్రయాలు ఓ రెండు రోజులు సాగినా, ఆ తదుపరి మద్యం కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి, చివరకు కొందరైతే బలన్మరణాలకు పాల్పడే పనిలో పడ్డారు. నాటు సారా తయారీదారులు రంగంలోకి దిగారు. చెన్నై శివారుల్లో, ఉత్తర చెన్నై పరిసరాల్లో నాటు సారా అమ్మకాలు తెరమీదకు వచ్చాయి. వేలూరు, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, తిరునల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, కృష్ణగిరి, ధర్మపురి పరిసరాల్లో నాటు సారా తయారీ మీద దృష్టి పెట్టే వారి సంఖ్య పెరిగింది. బుధవారం వేలూరు సమీపంలోని పులియంపట్టిలో నాటు సారా తయారీదారుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు సైతం జరపక తప్పలేదు. వేలూరు జిల్లా ఆంబూరులో నాటు సారా తాగిన ఓ వ్యక్తి శుక్రవారం మరణించడంతో ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. ( కరోనా విజృంభణ.. మమల్ని ఆదుకోండి: ట్రంప్ )
స్పిరిట్... లోషన్లు
మద్యం దొరక్క పోవడంతో స్పిరిట్‌ను నీళ్లలో, షేవింగ్‌కు ఉపయోగించే లోషన్లు, ఇతర మత్తును ఇచ్చే వాటిని శీతల పానీయాల్లో కలుపుకుని తాగే వారి సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. నాటు సారా కేవలం వేడి నీళ్లలో స్పిరిట్‌ను కలిపి విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తుండడం బట్టి చూస్తే, కరోనా తాండవం కన్నా, మద్యం రూపంలో మరణ మృదంగం రాష్ట్రంలో మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే శనివారం పుదుకోట్టైలో ఓ ఘటన వెలుగు చూసింది. పుదుకోట్టైలోని కోట్టపట్టినం జాలర్లు హాసన్ (35), అరుణ్(27), అన్వర్(33) మద్యానికి బానిసలయ్యారు. మందు కోసం తీవ్రంగా గింజుకున్న వీరు ఎవరో ఇచ్చిన సలహా మేరకు శీతల పానీయంలో షేవింగ్ లోషన్ కలుపుకుని తాగేశారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన హాసన్, అరుణ్ విగత జీవులయ్యారు.
తీవ్ర అస్వస్థతకు లోనైన అన్వర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం పుదుకోట్టై ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. ముందుగా ప్రకటించిన మేరకు 14వ తేదీనాటికి లాక్‌డౌన్ ముగిస్తే సరి, ఒక వేళ కొనసాగిన పక్షంలో మందు కోసం తాగుబోతులు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్న అన్ని మద్యం దుకాణాల్లోని స్టాక్‌ను అక్కడి ఓ కల్యాణ మండపానికి తరలించారు. అక్కడ పోలీసు పహారా నడుమ వీటిని భద్ర పరిచినా, ఆ పరిసరాల్లో ఒక్కటంటే ఒక్క బాటిల్ ఇవ్వండి అంటూ మందు బాబులు వేడుకుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment