
చెన్నై: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అని ఊరికే అనలేదు.. కరోనా వైరస్ ప్రబళుతున్న వేళ ఎవరూ బయటకు రావద్దని, ఒకవేళ అత్యవసర పని ఉందంటూ బయట అడుగుపెట్టినా ముఖానికి మాస్కు ధరించాలని, సామాజిక ఎడబాటు పాటించాలని అధికారులు పదే పదే చెప్తున్నారు. అయినా వీటిని చెవికెక్కించుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించేవారు కోకొల్లలు. దీంతో ఏకంగా కరోనానే రోడ్ల మీదకు తీసుకొచ్చారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో 12వ డివిజన్‌లో చోటు చేసుకుంది. కరోనా నమూనాతో ఓ ఆటోను తయారు చేసి వీధుల్లో తిప్పుతూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి అధికారులు. (కరోనా కేసులతో ధారావి విలవిల..)
ఇంట్లోనే ఉంటూ వైరస్ వ్యాప్తిని నివారిద్దామంటూ పిలుపునిస్తున్నారు. ఏదైనా అర్జంట్ పని మీద బయటకు వచ్చినప్పుడు మాస్క్ తప్పనిసరని సూచిస్తున్నారు. పొరపాటున మాస్క్ మరిచి వచ్చినా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాస్క్ పెట్టుకోకుండా తిరిగినా మీ జేబుకు చిల్లు పడక తప్పదు. ఎందుకంటే ఫేస్ మాస్క్ ధరించకపోతే ఆ ప్రాంతంలో రూ.100 జరిమానా విధిస్తున్నారు. అంతేకాకుండా నాలుగు మాస్క్‌లు కూడా చేతిలో పెట్టి పంపిస్తున్నారు. గతంలోనూ అధికారులు ఇలాంటి వినూత్న ప్రయోగాలతో కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.. (ఆకలి తట్టుకోలేక కప్పలు తింటున్న చిన్నారులు)