న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు | Coronavirus: Telugu People In New York And New Jersey In Fear Of Covid-19 | Sakshi
Sakshi News home page

న్యూయార్క్, న్యూజెర్సీలలో తెలుగువారు బెంబేలు

Published Wed, Mar 25 2020 5:09 AM | Last Updated on Wed, Mar 25 2020 12:46 PM

Coronavirus: Telugu People In New York And New Jersey In Fear Of Covid-19 - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలుగు ప్రజలు అత్యధిక సంఖ్యలో నివసించే న్యూజెర్సీ, దాని పక్కనే ఉన్న న్యూయార్క్‌ నగరం కుప్పలు తెప్పలుగా నమోదవుతున్న కోవిడ్‌ కేసులతో తల్లడిల్లుతోంది. న్యూజెర్సీతోపాటు కాలిఫోర్నియాలోనూ రికార్డు సంఖ్యలో కేసులు నమోదు కావడం భారతీయ కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి ఒక్క న్యూయార్క్‌ నగరంలో 29,875 కేసులు నమోదుకాగా దాన్ని ఆనుకొని ఉన్న న్యూజెర్సీలో 2,844 మంది కోవిడ్‌ బారినపడ్డారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు కనిపించిన మొదట్లో అత్యధిక కేసులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలు ఇప్పుడు మూడు, నాలుగు స్థానాలకు పడిపోగా మార్చి మొదటి వారంలో మొదటి 10 స్థానాల్లోనూ లేని న్యూయార్క్, న్యూజెర్సీ ఇప్పుడు మొదటి రెండు స్థానాలకు ఎగబాకడం ఆందోళన కలిగిస్తోంది.

న్యూయార్క్‌లో ఈ వ్యాధి బారినపడ్డ వారిలో 157 మంది మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 2,844 మందికి పాజిటివ్‌ రాగా చికిత్స పొందుతూ వారిలో 27 మంది మరణించారు. రెండేళ్ల క్రితం నాటి లెక్కల ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లతో పోలిస్తే మన వాళ్లు 3.8 శాతం ఉండగా శాన్‌ఫ్రాన్సికో, అలమేద (కాలిఫోర్నియా) కౌంటీల్లో భారతీయులు 3.4 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ కరోన వ్యాధి బారిన పడ్డ వారు ఎక్కువ సంఖ్యలో ఉంటడం సహజంగానే ఇక్కడి వారి కుటుంబాలు ఆందోళనగా ఉన్నాయి. 

మనవారిలో గుబులు...
న్యూయార్క్, న్యూజెర్సీలలో పరిస్థితి తీవ్రంగా ఉన్న దృష్ట్యా ఎవ్వరూ గడప దాటి బయటకు రావడం లేదు. ఒక్క న్యూయార్క్‌ నగరంలోనే భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రానికి 12,305 కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీలో వందల సంఖ్యలో కోవిడ్‌ కేసులు పాజిటివ్‌ రావడంతో అక్కడ నివసించే తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ‘మేము నివాసం ఉండే కమ్యునిటీలో 123 కేసులు నమోదయ్యాయి. బయటకు వెళ్లాలంటే భయమేస్తోంది. నెల రోజులకు సరిపడా ఉన్న సరుకులు రెండు మాసాల దాకా వచ్చేలా పరిమితంగా వాడుకుంటున్నాం. భారత్‌లో కరోనా కేసులు ఉన్నా ఇప్పుడు విమానాలు నడిస్తే ఇక్కడి నుంచి రావాలని ఉంది’అని పుంజాల సుస్మిత వాపోయింది.

న్యూజెర్సీలో ఉండే మల్లు శ్రీదేవి (29) 8 నెలల గర్భిణి. ‘నేను, నా భర్త మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా తల్లిదండ్రులు ఏప్రిల్‌ 11న రావడానికి టికెట్లు కూడా బుక్‌ చేసుకున్నారు. కానీ వారు రాకపోవచ్చు. డాక్టర్‌ చెప్పిన దాని ప్రకారం ఏప్రిల్‌ 20–22 నా ప్రసవ తేదీ. ఇప్పుడు నా పరిస్థితిని తలచుకుంటే కన్నీరు ఉబికి వస్తోంది’అంటూ పెట్టిన వాట్సాప్‌ సందేశం మిగిలిన వారిని కదిలించింది. అయితే ప్రసవ సమయంలో తాము అండగా ఉంటామని, కోవిడ్‌ను లెక్కచేయబోమని గ్రూపులో ఉన్న అనేక మంది తెలుగు మహిళలు మద్దతు ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement