మాస్క్‌లు ధరించిన ప్రయాణికులతో నిండిపోయిన ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్
న్యూఢిల్లీ: ఒకే రోజు భారత్ మొత్తమ్మీద 60 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 283కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. వీరిలో వ్యాధి కారణంగా మరణించిన ఐదుగురితోపాటు 39 మంది విదేశీయులు (ఇటలీ 17, ఫిలిప్పీన్స్ 3, యూకే 2, కెనడా, ఇండోనేసియా, సింగపూర్‌ల నుంచి ఒక్కొక్కరు) కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్రలో వైరస్ బాధితుల సంఖ్య 63కు చేరుకోగా ఇందులో నలుగురు విదేశీయులు ఉన్నారు. కేరళలో ఏడుగురు విదేశీయులతో కలిపి 40 మంది వ్యాధి బారిన పడ్డారు.
ఢిల్లీలో ఒక విదేశీయుడితో కలిపి 26 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఒక విదేశీయుడు, 24 మంది, తెలంగాణలో 11 మంది విదేశీయులతో కలిపి 21 మంది, రాజస్తాన్‌లో ఇద్దరు విదేశీయులతో కలిపి 17 మంది హరియాణాలో 14 మంది విదేశీయులు, ముగ్గురు భారతీయులు వ్యాధి బారిన పడినట్లు అధికారులు చెప్పారు. కర్ణాటకలో మొత్తం 15 మంది కోవిడ్ బాధితులు ఉండగా, పంజాబ్, లడాఖ్‌లలో 13 మంది చొప్పున, గుజరాత్‌లో ఏడుగురు, కశ్మీర్‌లో నలుగురు ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ముగ్గురు చొప్పున వ్యాధి బారిన పడ్డారు. పుదుచ్చేరి, చత్తీస్‌గఢ్, చండీగఢ్‌లలో ఒక్కో కేసు నమోదైంది. విద్యా సంస్థల హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను అక్కడే ఉండనివ్వాలని, తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని మానవ వనరుల మంత్రిత్వశాఖ దేశంలోని విద్యా సంస్థలకు సూచించింది.
యూపీ మంత్రికి నెగెటివ్
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన గాయని కనిక కపూర్‌తో ఒక పార్టీలో గడిపిన ఉత్తరప్రదేశ్ మంత్రి జై ప్రతాప్ సింగ్ కోవిడ్ బారిన పడలేదని శనివారం స్పష్టమైంది. కనిక కపూర్ పార్టీలో గడిపిన తర్వాత జై ప్రతాప్ ఇంటికే పరిమితం కాగా.. ఆయన రక్త నమూనాల్లో వైరస్ లేనట్లు పరీక్షలు స్పష్టం చేశాయి. జై ప్రతాప్‌తో సన్నిహితంగా మెలిగిన 28 మందికీ వ్యాధి సోకనట్లు స్పష్టమైందని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ అధికార ప్రతినిధి డాక్టర్ సుధీర్ సింగ్ తెలిపారు. తనకు కరోనా సోకినట్లు కనిక కపూర్ ప్రకటించిన తరువాత ఆ గాయనితో సన్నిహితంగా మెలిగిన రాజస్తాన్ మాజీ సీఎం వసుంధర రాజే, కుమారుడు దుష్యంత్ సింగ్‌లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లడం తెల్సిందే.
ఆన్‌లైన్‌లో విలేకరుల సమావేశం
కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఇకపై విలేకరుల సమావేశాలన్నింటినీ ఆన్‌లైన్ మార్గంలో నిర్వహించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా విలేకరులు వ్యాధి బారిన పడకుండా నివారించవచ్చునన్నది ప్రభుత్వ ఉద్దేశం. ‘కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న విలేకరులు తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇకపై ఢిల్లీ ప్రభుత్వపు అన్ని విలేకరుల సమావేశాలను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తాం’ అని సీఎం కేజ్రీవాల్ ట్వీట్‌చేశారు. ఢిల్లీలో పేదలను ఆదుకునేందుకు వచ్చే నెల యాభై శాతం రేషన్ సరుకులు ఎక్కువగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వితంతు, దివ్యాంగుల, వృద్ధాప్య పింఛన్లను రెట్టింపు చేశారు
పలు రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు
ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో మార్చి 31వరకు నియంత్రణలు విధిస్తున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు తెలపగా గోవా మొత్తం 144 సెక్షన్ విధిస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో స్టార్‌హోటళ్లతోపాటు అన్నిచోట్ల మద్యం అమ్మకాలను నిలిపివేశారు. బెంగాల్‌లో అన్ని బార్లు, పబ్‌లు, హోటళ్లను బంద్ చేశారు.
అత్యవసర వైద్యం కోసం శిక్షణ
కరోనా వైరస్ ప్రభావం మరింత తీవ్రతరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వ్యాధిపీడితులకు తగిన చికిత్స అందించేందుకు దేశంలోని వెయ్యి ప్రాంతాల్లో కొంతమందికి వీడియో ద్వారా శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్న అంశంపై ఆదివారం ఒక డమ్మీ డ్రిల్ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు జరిగాయని, లక్షణాలు లేకున్నా వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి ఐదు, 14వ రోజుల్లో పరీక్షలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు.
మాస్కులు, శానిటైజర్ల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని, డియోడరెంట్లు తయారు చేసే కంపెనీలు శానిటైజర్లు తయారు చేసేందుకు రాష్ట్రాలు అనుమతివ్వాలని సూచించారు. మాస్కుల వాడకంపై చాలా అపోహలు ఉన్నాయని, ఇవి అందరికీ అవసరం లేదని మనుషులకు కొంచెం దూరంగా ఉండటం వైరస్ వ్యాప్తి నిరోధానికి ముఖ్యమని వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకుపోయిన 1700 మంది భారతీయులను తిరిగి తెచ్చిందని తెలిపారు. సామూహిక వ్యాప్తి జరుగుతోందా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. అలా జరిగినప్పుడు ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. కోవిడ్ బారిన పడ్డ వారికి సన్నిహితంగా ఉన్న స్ముఆరు 7000 మందిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
ప్రయాణాలు వద్దు: మోదీ
వలసదారులు సహా ప్రజలంతా ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని, కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేయవద్దని ప్రధాని కోరారు. ఇలాంటి సమయాల్లో ప్రయాణాలు చేసే వారు, తమతోపాటు కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని హెచ్చరించారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని కోరారు. నగరాల్లో కరోనా కేసులు బయటపడటంతో జనం భయంతో సొంతూళ్లకు వెళుతున్నారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో మోదీ మాట్లాడారు. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వెళ్లడం వల్ల వైరస్ ముప్పు మరింత పెరుగుతుందన్నారు. అలాగే, సొంతూళ్లకు వెళితే అక్కడి వారికి కూడా ఈ వ్యాప్తి విస్తరించే ప్రమాదముందని పేర్కొన్నారు. అందుకే, అత్యవసరమైతేనే బయటకు అడుగుపెట్టాలని దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment