కేసుల రాజీలో కోర్టులు సంయమనం పాటించాలి
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో ఇరు పార్టీలు పరస్పరం రాజీ చేసుకునేందుకు అనుమతించే సందర్భంలో కోర్టులు న్యాయ పరమైన సంయమనాన్ని పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ ప్రకారం కక్షిదారులు తమంతట తాము రాజీ చేసుకునేందుకు వీలులేని కేసుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టుతో సహా అన్ని కోర్టులు ఇరు వర్గాల రాజీకి అనుమతించవచ్చంది.
ఈ మేరకు పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. భటిండాకు చెందిన ఒక సంస్థపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా... మోసం, ఫోర్జరీ కింద కేసు పెట్టింది. తర్వాత బ్యాంకుతో అది రాజీ పడింది. దీంతో క్రిమినల్ కేసును కొట్టేయాలని కోర్టును కోరింది. సెక్షన్ల ప్రకారం రాజీ కుదరదని చెబుతూ ట్రయల్ కోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. తర్వాత హైకోర్టును ఆశ్రయించగా... ఇరు పార్టీల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో క్రిమినల్ కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది.