
అయితే, ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు.
తిరువనంతపురం: కరోనా విజృంభణతో కేరళలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ 6 కేసులు బయటపడగా.. మంగళవారం ఒక్కరోజే మరో ఆరు కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర కేబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేటి నుంచి మార్చి ఆఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నామని మంత్రివర్గ భేటీ అనంతరం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. అయితే, ఏడో తరగతి పైబడిన విద్యార్థులకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు.
(చదవండి: కోవిడ్: వుహాన్‌లో జిన్‌పింగ్ పర్యటన!)
అలాగే, ఈ నెల మొత్తం ప్రభుత్వపరమైన వేడుకలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. సినిమాహాళ్లు, డ్రామా కంపెనీలు మాసాంతం వరకు తెరవొద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటికే నిశ్చయమైన పెళ్లిళ్లు మాత్రమే జరపాలని, అవికూడా తక్కువ మందితో నిర్వహిస్తే మంచిదని అన్నారు. మత సంబంధమైన వేడుకలు కూడా నిర్వహించొద్దని ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నామని, ప్రజలు భయాందోళను గురికావాల్సిన పనిలేదని ముఖ్యమంత్రి వెల్లడించారు.
(చదవండి)
ఏకంగా ఆ దేశాన్నే నిర్భందించిన కరోనా వైరస్
కరోనా భయం: రైళ్లో వాగ్వాదం.. వైరల్
ప్రజలంతా బాధ్యతతో వ్యవహరిస్తే వైరస్‌ను ఎదుర్కోవడం సులభేనన్నారు. కేరళలో నెల క్రితం మూడు కోవిడ్ కేసులు నమోదు కాగా.. సత్వర వైద్య చికిత్సతో వారు కోలుకున్నారని గుర్తు చేశారు. తాజాగా వైరస్ బారినపడిన వారుకూడా కోలుకుంటారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కేరళ వ్యాప్తంగా 1116 మంది కరోనా అనుమానితులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. పతనమిట్ట, ఎర్నాకుళం, కొట్టాయం జిల్లాల్లో వీరి సంఖ్య అధికంగా ఉంది. అయితే, అనుమానితుల్లో చాలామంది ఆరోగ్యపరంగా పురోగతి సాధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
(అధిక ధరలకు మాస్క్‌ల విక్రయం)