జమ్మూలో ఒకే వాహనంపై ఐదుగురు ప్రయాణిస్తుండగా అడ్డుకుంటున్న భద్రతా సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ: రెండో దశ లాక్‌డౌన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని శిక్షించదగ్గ నేరంగా నిర్ధారించారు. మద్యం, గుట్కా, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు. అన్ని రకాల ప్రజా రవాణాను మే 3వ తేదీ వరకు నిషేధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు ఏప్రిల్ 20 వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించవచ్చు. అయితే, వాటిలోని కార్మికులు, సిబ్బంది భౌతిక దూరం సహా అన్ని సాధారణ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలి. మే 3వ తేదీవరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తరువాత కొన్ని కార్యకలాపాలకు అనుమతిస్తామని కూడా ఆయన చెప్పారు. అందులో భాగంగానే లాక్‌డౌన్ కాలంలో ఆచరించాల్సిన, ఆచరించకూడని చర్యలతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. నిబంధనల సడలింపు వైరస్ హాట్ స్పాట్స్‌కు, కంటైన్మెంట్ జోన్స్‌కు వర్తించబోదని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన నిబంధనలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా పాటించాలని, అవసరమైతే, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని, మరింత కఠినమైన ఆంక్షలను విధించవచ్చని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే లక్ష్యంతో ఏప్రిల్ 20 నుంచి పలు నిబంధనలను సడలించారు. వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగడం, ధాన్య సేకరణ జరగడం, దినసరి, రైతు కూలీలకు ఉపాధి కల్పించడం ఈ నిబంధనల సడలింపు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
మార్గదర్శకాలివీ..
► అన్ని పని ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ సదుపాయాలను కల్పించాలి.
► ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎలక్ట్రీషియన్లు, ఐటీ రిపేర్ వర్కర్లు, ప్లంబర్లు, మోటారు మెకానిక్‌లు, కార్పెంటర్లు తమ పనులు చేసుకోవచ్చు.
► మే 3 వరకు అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా ప్రయాణాలు నిషేధం. అందువల్ల మే 3 వరకు బస్సు, మెట్రో సర్వీసులు కూడా నడవవు.
► ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎస్‌ఈజెడ్‌ల్లోని పరిశ్రమలు, ఎగుమతులు చేసే పారిశ్రామిక కేంద్రాలు, ఇతర పారిశ్రామిక టౌన్ షిప్స్ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు.
► విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, జిమ్స్, క్రీడాకేంద్రాలు, ఈత కొలనులు, బార్ అండ్ రెస్టారెంట్స్ పై మే 3 వరకు నిషేధం కొనసాగుతుంది.
► మత ప్రాంతాలు, ప్రార్థనాకేంద్రాలను మే 3 వరకు మూసేయాలి. అప్పటివరకు రాజకీయ,క్రీడ, సామాజిక, మత కార్యక్రమాలపై కూడా నిషేధం కొనసాగుతుంది.
► హైవేలపై ఉన్న దాబాలు(హోటళ్లు), ట్రక్ రిపేరింగ్ షాప్స్, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన కాల్ సెంటర్లు ఏప్రిల్ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
► వ్యవసాయ కార్యకలాపాలకు అవసరమైన సామగ్రిని అమ్మే, వాటిని మరమ్మత్తులు చేసే షాపులను ఏప్రిల్ 20 నుంచి తెరవొచ్చు. వ్యవసాయ, పండ్ల తోటల రంగాలకు సంబంధించిన కార్యకలాపాలను నేటి నుంచే ప్రారంభించవచ్చు.
► ఔషధ, వైద్య పరికరాల తయారీ యూనిట్లు, ఆరోగ్య మౌలిక వసతులకు సంబంధించిన యూనిట్లు ఏప్రిల్ 20 నుంచి కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.
► లాక్‌డౌన్ సమయంలో కిరాణా షాపులు, పండ్లు, కూరగాయల దుకాణాలు/బండ్లు, మిల్క్ బూత్స్, మాంసం, చేపలు అమ్మే దుకాణాలు తెరిచే ఉంటాయి.
► అనుమతించిన పరిశ్రమలు ఫ్యాక్టరీ ప్రాంగణం, లేదా దగ్గర్లోని భవనాల్లో సిబ్బంది, ఇతర కార్మికులు ఉండేందుకు సదుపాయాలు కల్పించాలి. భౌతిక దూరం తదితర నిబంధనలను అమలు చేయాలి.
► రక్షణ, పారా మిలటరీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, విపత్తు నిర్వహణ, ఎన్‌ఐసీ, ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్ర, కస్టమ్స్ కార్యాలయాలు యథావిధిగా పనులు చేసుకోవచ్చు. మిగతా శాఖల్లో డిప్యూటీ సెక్రటరీ ఆపై హోదా ఉన్న అధికారులు కచ్చితంగా 100% హాజరు పాటించాలి. మిగతా ఉద్యోగులు అవసరాన్ని బట్టి 33% వరకు హాజరయ్యేలా చూసుకోవాలి. ప్రజల అవసరాలను బట్టి, అవసరమైన ఇతర కార్యకలాపాలకు రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు ఏప్రిల్ 20 నుంచి అనుమతినివ్వవచ్చు.
► లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ నియమిత సంఖ్యలో పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతినిచ్చారు.
► ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యకలాపాలు, ఈ కామర్స్ కార్యకలాపాలు, డేటా, కాల్ సెంటర్ విధులు, ఆన్‌లైన్ బోధన, దూరవిద్య విధానాలను కొనసాగించవచ్చు.
► నిత్యావసర వస్తువులను నేరుగా వినియోగదారుల ఇళ్ల వద్దకే సరఫరా చేసే విధానాన్ని అధికారులు ప్రోత్సహించాలి.
► బ్యాంకులు, బీమా కార్యాలయాలు, నగదు నిర్వహణ సంస్థలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు యథావిధిగా పనిచేస్తాయి.
► అన్ని సంస్థలు వీలైనంత వరకు ఉద్యోగులు తమ ఇళ్లలో నుంచే విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలి.
► ఆహారం, ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేసే ఈ కామర్స్ సంస్థలకు అనుమతి.
► కచ్చితంగా కొనసాగించాల్సిన అవసరం ఉన్న ఉత్పత్తి సంస్థలు రాష్ట్రాల అనుమతితో పనులు చేపట్టవచ్చు.
► బొగ్గు, ఇతర ఖనిజ ఉత్పత్తిలో ఉన్న సంస్థలు పనులు ప్రారంభించవచ్చు.
► ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ఉత్పత్తి సంస్థలు విధులు ప్రారంభించవచ్చు.
► నిత్యావసర, నిత్యావసరంకానివి అనే భేదం లేకుండా అన్ని వస్తువుల రవాణాకు అనుమతినిచ్చారు.
► అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో 20 మందికి మించి పాల్గొనరాదు.
► రోడ్లు, భవనాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులు, పునరుత్పాదిత ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులకు అనుమతినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment