ముంబైలోని ధారావి మురికివాడవాసులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్న వైద్యసిబ్బంది
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పైపైకి ఎగబాకుతోంది. మంగళవారం నుంచి బుధవారం వరకు.. గత 24 గంటల్లో 39 మంది కన్నుమూశారు. మహారాష్ట్రలో 18 మంది, ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు, గుజరాత్‌లో నలుగురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, కర్ణాటకలో ఇద్దరు, తెలంగాణలో ఒకరు, తమిళనాడులో ఒకరు, పంజాబ్‌లో ఒకరు, మేఘాలయాలో ఒకరు మృతిచెందారు. కొత్తగా 1,118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 11,933కు, కరోనా సంబంధిత మరణాల సంఖ్య 392కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా పాజిటవ్ కేసులు 10,197 కాగా, 1,343 మంది చికిత్సతో కోలుకున్నారు. ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా చోటుచేసుకున్న 392 మరణాల్లో 178 మరణాలు మహారాష్ట్రలోనే వెలుగుచూడడం గమనార్హం. మహారాష్ట్రలో ఇప్పటిదాకా 2,687 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 1,561, తమిళనాడులో 1,204, రాజస్తాన్‌లో 1,005, మధ్యప్రదేశ్‌లో 987, ఉత్తరప్రదేశ్‌లో 735, గుజరాత్‌లో 695 కేసులు బయటపడ్డాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్లుగా, 207 జిల్లాలను నాన్–హాట్‌స్పాట్లుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం చెప్పారు. నాన్–హాట్‌స్పాట్ జిల్లాల్లోనూ కరోనా తీవ్రత పెరిగే అవకాశం(పొటెన్షియల్) ఉన్నందున అక్కడ నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇంకా సామూహిక సంక్రమణ దశకు చేరుకోలేదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లలో పని చేయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించామని, కరోనా అనుమానితులను గుర్తించడానికి వీరంతా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారని పేర్కొన్నారు.
కరోనా నియంత్రణ చర్యలు మరింత పటిష్టం
హాట్‌స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. అక్కడ మనుషుల కదలికలపై కఠినమైన ఆంక్షలు అమలవుతాయని స్పష్టం చేసింది. హాట్‌స్పాట్లలో అన్ని రకాల వైద్య సేవలకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లలో ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్‌లు, మందుల దుకాణాలు, ఫార్మసీలు, జన ఔషధీ కేంద్రాలు, వైద్య ఉపకరణాల దుకాణాలు, మెడికల్ ల్యాబ్‌లు, వెటర్నరీ ఆసుపత్రులు యథాతథంగా పని చేస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment