సాక్షి ప్రతినిధి, ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రాను పార్లమెంటులో అభిశంసించాలన్న సీపీఎం ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, బీజేపీ ఈ అంశంపై మౌనం వహించింది. సుప్రీంకోర్టులో నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ఈ నెల 12న మీడియా ముందుకు వచ్చి జస్టిస్ మిశ్రాపై పలు ఆరోపణలు చేయడం తెలిసిందే.
దీంతో సీజేఐను పార్లమెంటులో అభిశంసించేందుకు అన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో కపిల్ సిబల్ సహా కొందరు నేతలు అభిశంసనకు మద్దతివ్వగా.. చిదంబరం, ఆనంద్ శర్మ, ఆంటోనీ తదితరులు వ్యతిరేకించారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే తొలిదశ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకే రాకపోవచ్చనీ, మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే రెండో దశ సమావేశాల్లో దీన్ని చేపట్టే అవకాశం ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
‘తొలిసారి’ ఒకే కార్యక్రమంలో సీజేఐ, జడ్జీలు
నలుగురు న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సీజేఐపై ఆరోపణలు చేసిన అనంతరం తొలిసారిగా...జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు సీజేఐతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు కరచాలనం కూడా చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment