మరణ రహస్యం.. భార్యను, పోలీస్ శాఖను మోసం చేశాడు
ముంబై: ఎక్కడికెళ్లినా అధికార దర్పం, గౌరవానికి కొదవలేదు. ఇన్స్పెక్టర్గారికి కింది స్థాయి సిబ్బంది నమస్కారం చేసి వెళ్తుంటారు. భార్య, పోలీస్ శాఖ అందరూ ఆయన ఇన్స్పెక్టరేనని నమ్మారు. చివరి రోజు కూడా పోలీసు మర్యాదలు అందుకున్నాడు. అయితే ఆయన మరణించిన తర్వాతే ఇన్స్పెక్టర్ కాదనే నిజం బయటపడింది. అందర్నీ నివ్వెరపరిచిన ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది.
పుణె సమీపంలో మంగళవారం బ్రహ్మ వడ్గాన్కర్ (37) అనే వ్యక్తి భార్యతో కలసి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతను పుణెలో ఏసీబీ ఇన్స్పెక్టర్గా అందరికీ గుర్తింపు. ఈ వార్త తెలియగానే వచ్చిన పోలీసులు వడ్గాన్కర్ జేబులోని గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు చూసి పోలీస్ హెడ్క్వార్టర్స్కు ఫోన్ చేశారు. డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ వెంటనే స్పందించి ఆయనకు సాయం చేయాల్సిందిగా పుణె ఏసీబీ ఆఫీసుకు సమాచారం చేరవేశారు. ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగడంతో అసలు విషయం బయటపడింది. వడ్గాన్కర్ ఇన్స్పెక్టర్ కాదని ఒకప్పుడు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడని తేలింది. కాగా ప్రమాదంలో వడ్గాన్కర్ మరణించగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గుర్తింపు కార్డు, అధికార పత్రాలు, బదిలీ ఉత్తర్వులు నకిలీవని కనుగొన్నారు. ఈ విషయం ఆయన భార్యకు చెప్పగా తొలుత ఆమె నమ్మలేదు. పోలీసులు వివరాలు చెప్పడంతో ఆమె కలల ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. పెళ్లికి ముందు ఇంగ్లండ్లో ఉన్న ఆమెకు ఓ వివాహ ప్రకటన ద్వారా వడ్గాన్కర్ పరిచయమయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులు కట్నంగా బంగారు, నగదు ఇచ్చి పెళ్లి చేశారు. కాగా పెళ్లికి అతని కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. వారికి ఇష్టం లేకపోవడంతో రాలేదని పెళ్లికూతురు వారిని నమ్మించారు. పెళ్లియిన తర్వాత వడ్గాన్కర్ లాకర్లో పెడతానంటూ నగలు తీసుకెళ్లాడు. భార్యను, పోలీసులను మోసగించిన వడ్గాన్కర్ చివరకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతను మరెవరినైనా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.