‘దిశ’అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ ద్వారా వారి తల్లిదండ్రులకు కాస్త ఉపశమనం వచ్చిందేమో కానీ పూర్తి స్థాయి న్యాయం జరిగిందా? సాహో తెలంగాణ పోలీసు అని జనం జేజేలు పలుకుతున్నారు సరే, భవిష్యత్‌లో అత్యాచారాలకు అడ్డుకట్ట పడుతుందన్న భరోసా ఉందా? అత్యంత క్రూరమైన అత్యాచార కేసులు కూడా ఏళ్లకి ఏళ్లు కోర్టుల్లో నానుతూ ఉంటే బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు?. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒక్కటే. రేపిస్టులను బహిరంగంగా ఉరి తీయండి.. సత్వర న్యాయం జరిగేలా చూడండి. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను సిద్ధాంతం మన దగ్గర సాధ్యమేనా? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్...
న్యాయం ఆలస్యమైతే అన్యాయమే...
దేశం నలుమూలలా ప్రతిరోజూ మహిళల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. సగటున దేశవ్యాప్తంగా రోజుకు 92 అత్యాచార కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్ని విచారించడానికి కోర్టుల్లో తగిన సిబ్బంది లేకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య తడిసి మోపెడవుతోంది. ఇక అత్యాచార కేసుల్లో దోషులుగా తేలేవారి సంఖ్య కూడా అత్యంత స్వల్పంగా ఉంది. చాలా ఏళ్లపాటు 25% నుంచి 30% కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. కానీ 2014లో మాత్రం శిక్షల రేటు 27 నుంచి 38 శాతానికి పెరిగింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో సత్వర న్యాయానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటనలు చేస్తోంది. 2019 నాటికి దేశంలో 664 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉంటే, ప్రభుత్వం వాటిని 1,023కి పెంచుతామని చెబుతోంది. కానీ అవి కూడా సరిగా పనిచేస్తున్న దాఖలాలు లేవు. ఉరి శిక్ష పడాలంటే మన దేశంలో సగటున అయిదేళ్లు పడుతోంది. ఎందుకంటే ప్రత్యేక కోర్టులో శిక్ష పడితే, పై కోర్టుకి వెళ్లే అవకాశం ఉంటుంది. అక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు... అక్కడ శిక్ష ఖరారు చేసినా అమలవుతుందన్న గ్యారంటీ లేదు. మరణ శిక్ష పడిన దోషులకి రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే హక్కు ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేసరికి కొన్ని కేసుల్లో ఉరిశిక్ష అమలుకే 20 ఏళ్లు దోషులు జైల్లో ఉన్న సందర్భాలున్నాయి. అందుకే సత్వర న్యాయం అన్నది మన దగ్గర సాధ్యపడటం లేదు. 1991 నుంచి 2017, డిసెంబర్ చివరి నాటికి 371 మందికి ఉరిశిక్ష పడింది. కానీ గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఉరిశిక్ష అమలు జరిగిందంటే న్యాయం జరగడంలో ఎంత అన్యాయం జరుగుతుందో అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నేరము..శిక్ష..
మన దేశంలో అత్యాచార కేసులు అంటే నిర్భయ ఘటనకి ముందు.. తర్వాత.. అని మాట్లాడుకోవాలి. దేశం నలుమూలలా గంటకో రేప్ జరుగుతున్నప్పటికీ 2012 ఢిల్లీలో అర్ధరాత్రి నిర్భయని అమానుషంగా హింసించి మరీ గ్యాంగ్ రేప్ చేయడంతో దేశం యావత్ కదిలి వచ్చింది. యువత అంతా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి రేపిస్టులని ఉరితీయాలంటూ ఎలుగెత్తి నినదించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. అప్పటివరకు రేపిస్టులకు ఏడేళ్లు ఉన్న శిక్షని 20 ఏళ్లకి పెంచారు. గ్యాంగ్ రేప్‌లు, పదే పదే అత్యాచారాలు చేసిన వారికి ఉరి శిక్ష అమలు చేయాలంటూ చట్టం తెచ్చారు. అయినా అత్యాచార కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కామాంధులు చిన్నారుల్ని కూడా చిదిమేస్తుండటం, మైనర్లు కూడా అత్యాచారాలకు తెగబడుతూ ఉండటంతో 2015లో జువెనైల్ జస్టిస్ చట్టానికి సవరణలు తెచ్చారు. అత్యాచారం, హత్య కేసుల్లో 16 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వారిని మేజర్లుగా పరిగణించారు. ఇక 12 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారుల్ని అత్యాచారం చేస్తే ఉరే సరి అని ఆ చట్టం చెబుతోంది. ఈ చట్టం తీసుకువచ్చిన తర్వాత అత్యాచార కేసులు తగ్గకపోగా మరింత పెరిగిపోతున్నాయి.
జాతీయ నేర గణాంక నమోదు సంస్థ తాజా గణాంకాల ప్రకారం...
2012లో(నిర్భయ ఘటనకు ముందు).. 25 వేల కంటే తక్కువ
2013లో.. 33,707
2016లో.. 38,947
2017లో.. 30,000
ఈ చట్టం వల్ల అత్యాచార కేసులు తగ్గకపోయినా, మహిళలు నిర్భయంగా పోలీసు స్టేషన్ల గడపెక్కి కేసు నమోదు చేసే వాతావరణమైతే వచ్చింది. ఇది కాస్త ఊరట కలిగించే అంశం.
15 ఏళ్లలో నలుగురికి ఉరి..
2004 ఆగస్టు 14: టీనేజీ అమ్మాయిని అత్యాచారం, హత్య కేసులో దోషి అయిన ధనుంజయ్ ఛటర్జీని పశ్చిమ బెంగాల్‌లో అలీపూర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. అతని 42వ పుట్టిన రోజునాడే ఉరిశిక్ష అమలు చేశారు.
2012 నవంబర్ 21: ముంబై నగరంలో 2008లో జరిగిన దాడుల్లో పట్టుబడిన మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌కి ఉరిశిక్ష అమలు చేశారు. పుణేలో యరవాడ జైల్లో అతనికి ఉరిశిక్ష అమలు చేశారు.
2013 ఫిబ్రవరి 9: పార్లమెంట్‌పై 2001లో దాడి కేసులో దోషి మహమ్మద్ అఫ్జల్ గురుకి పన్నెండేళ్ల తర్వాత ఉరిశిక్ష విధించారు. తీహార్ జైల్లో అతనికి ఉరిశిక్ష అమలు జరిగింది.
2015 జూలై 30: 1993 ముంబై వరుస పేలుళ్లలో దోషి యాకూబ్ మెమన్‌కి ఉరిశిక్ష అమలైంది. మహారాష్ట్రలో నాగపూర్ జైల్లో అతన్ని ఉరి తీశారు.
ఇతర దేశాల్లో శిక్షలు ఇలా..
చైనా: అత్యాచార నిందితుల్ని నేరుగా ఉరికంబం ఎక్కిస్తారు. కొన్ని కేసుల్లో దోషుల పురుషాంగాన్ని తొలగించి నపుంసకులుగా కూడా మారుస్తారు. ఇదంతా నేరం జరిగిన రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోయినా ఉరిశిక్ష విధించడం విమర్శలకు దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఉరి తీశాక వారు నిర్దోషులని తేలడం గమనార్హం.
ఇరాన్: అత్యాచార దోషుల్ని బహిరంగంగా కాల్చి చంపుతారు. లేదంటే ఉరితీస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితురాలు క్షమించడానికి అంగీకరిస్తే, ఉరి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
అఫ్గానిస్తాన్: రేపిస్టులకు శిక్ష పడిన నాలుగు రోజుల్లోనే ఉరి తియ్యడమో, లేదంటే కాల్చి చంపడమో చేస్తారు.
యూఏఈ: రేప్ చేసిన ఏడు రోజుల్లో ఉరికంబం ఎక్కిస్తారు.
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో అత్యాచారం నేరం రుజువైతే బహిరంగంగా తలనరికి చంపుతారు.
నెదర్లాండ్స్: మహిళలపై జరిగే లైంగిక వేధింపులన్నింటినీ అత్యాచారం కిందే పరిగణిస్తారు. అమ్మాయి అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా అక్కడ నేరుగా జైలుకి పంపిస్తారు. నేర తీవ్రత ఆధారంగా 4 నుంచి 5 సంవత్సరాలు శిక్ష ఉంటుంది.
ఫ్రాన్స్: అత్యాచార చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయి.
అత్యాచార కేసుల్లో 15 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తారు. జైల్లో ఉన్నన్ని రోజులు వారిని చిత్రహింసలకు గురి చేస్తారు. నేర తీవ్రతని బట్టి దానిని 30 ఏళ్లకు పెంచుతారు.
అమెరికా: అమెరికాలో రెండు రకాల చట్టాలున్నాయి. ఒకటి కేంద్ర చట్టమైతే, రెండోది రాష్ట్రాలకు సంబంధించింది. ఫెడరల్ లా కింద అత్యాచార నేరం నిరూపణ అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. ఇక రాష్ట్ర పరిధిలో తీసుకుంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య శిక్షల్లో తేడాలుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment