సాక్షి, న్యూఢిల్లీ : ‘రేప్ బాధితురాలు మరణించారన్న విషయంతో సంబంధం లేదు. చనిపోయిన వారికి కూడా గౌరవం ఉంటుంది. చనిపోతే గౌరవం అక్కర్లేదని భావించడం భావ్యం కాదు’ అని సుప్రీం కోర్టుకు చెందిన జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలు గత డిసెంబర్‌లో ‘నిపున్ సక్సేనా వర్సెస్ కేంద్ర హోం శాఖ’ కేసులో భారతీయ శిక్షా స్మతిలోని 228(ఏ) సెక్షన్‌కు స్పష్టమైన భాష్యం చెప్పారు. రేప్ బాధితురాలి పేరును కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లో పోలీసులుగానీ, మీడియాగానీ వెల్లడించరాదు. ఆమె ఎవరో సమాజంలో నలుగురికి తెలిసేలా ఆమె ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, కనీసం కుటుంబసభ్యుల వివరాలను కూడా బహిర్గతం చేయరాదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఐపీసీ 228 (ఏ) సెక్షన్ తెలియజేస్తోంది. బాధితురాలు చనిపోతే, మైనరయితే, బుద్ధి మాంద్యం ఉంటే పేరు వెల్లడించడానికి సమీప బంధువుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని 228ఏ (2)(సీ) సెక్షన్ చెబుతోంది.
‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో అటు పోలీసు వ్యవస్థ, ఇటు మీడియాతోపాటు మహిళా సంఘాలు కూడా ఈ నిబంధనను పూర్తిగా ఉల్లంఘించాయి. చాలా ఆలస్యంగా బాధితురాలి పేరును ‘దిశ’గా మార్చాయి. ఆ పని ముందే చేయాల్సింది. ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆమె అసలు పేరేకాదు, కుటుంబం వివరాలను కూడా వెల్లడించకుండా పోలీసులు, మీడియా ఎంతో సంయమనం పాటించాయి. నిర్భయ తల్లిదండ్రులు ఆ తర్వాత నిర్భయంగా మీడియా ముందుకు వచ్చినప్పడే వారి వివరాలను బహిర్గతం చేశారు. ఇప్పటికీ ‘నిర్భయ’ అసలు పేరు సమాజానికి తెలియదు. లైంగిక దాడులకు సంబంధించిన కేసులను గోప్యంగా విచారించేందుకు ఐపీసీ 327 (2) సెక్షన్ జడ్జీలకు అధికారం ఇచ్చింది. ఈ విచారణలను కోర్టు అనుమతి లేకుండా మీడియా బహిర్గతం చేయరాదు. అలా చేస్తే శిక్షలు విధించే అధికారం కోర్టులకుంది. రేప్ బాధితులు దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లాలనుకున్నప్పుడు వారు మారు పేరును కూడా వాడుకోవచ్చు.
ఈ కేసులకు సంబంధించిన వైద్య పరీక్షలు, డీఎన్‌ఏ పరీక్షల విషయంలోనే కాకుండా ఎఫ్‌ఐఆర్ విషయంలోనూ గోప్యత పాటించాల్సి ఉంటుంది. లైంగిక దాడుల నుంచి మైనర్లను రక్షించడం కోసం 2012లో తీసుకొచ్చిన ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’లో కూడా ఈ నిబంధనలన్నింటిని పొందుపర్చారు. ‘కథువా అత్యాచారం–హత్య’లో ఈ నిబంధనలను అతిక్రమించినందుకు సుప్రీం కోర్టు గత ఏప్రిల్ నెలలో దేశంలోని 12 మీడియా సంస్థలకు జరిమానాలు విధించింది. ‘కోల్‌కతా పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్’ కేసులో బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అలాంటప్పుడు అలాంటి వారి అనుమతితో పేరు, వివరాలు బహిర్గతం చేయవచ్చు. ‘మన సమాజంలో లైంగిక దాడులకు పాల్పడిన నేరస్థులకన్నా ఆ దాడులకు గురైన బాధితులను నీచంగా చూస్తారు. అందుకని రేప్ కేసుల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.
‘దిశ’ పేరు బహిర్గతం చేయడం నేరం!
Published Mon, Dec 2 2019 3:23 PM | Last Updated on Mon, Dec 2 2019 4:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment