![Death Threats On Phone To Gautam Gambhir - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/21/gambhir_0.jpg.webp?itok=OzBVL0x0)
సాక్షి,న్యూఢిల్లీ: తనను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తనకు హత్యా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శనివారం ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తులు, ఇంటర్‌నేషనల్ ఫోన్ నెంబర్‌తో బెదిరింపులకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రతను కల్పించాల్సిందిగా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. గంభీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా నెంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తగిన భద్రత కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు.
కాగా పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళకారులు తీరును గంభీర్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. పోలీసులు ఆత్మరక్షణ కోసం లాఠీచార్జి చేస్తే అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదని, తమపై రాళ్లు విసురుతున్నప్పుడు, ప్రజల ఆస్తులను దహనం చేస్తూ హింసకు పాల్పడుతున్నప్పుడు ఆందోళనకారులను పోలీసులు ప్రతిఘటిస్తారని అభిప్రాయపడ్డారు. కేవలం నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేస్తే అది తప్పేనని గంభీర్ స్పష్టం చేశారు. హింసకు తావులేని రీతిలో నిరసన చేపడితే ఎవరికీ సమస్య ఉండదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment