సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకోసం కుమ్ములాట మొదలైంది. భాగస్వామిగా వ్యవహరించిన శశికళ, అన్నకుమార్తె దీప మధ్య ఆస్తులపై ఆధిపత్య పోరుకు మద్రాసు హైకోర్టు వేదికగా మారనుంది. కొడనాడు ఎస్టేట్ సహా అనేక స్థిరాస్తులు, కంపెనీలు తనకే సొంతమని శశికళ ప్రకటించుకోవడాన్ని జయలలిత అన్న కుమార్తె దీప తీవ్రంగా ఖండించారు. శశికళపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు శుక్రవారం ఆమె ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. జయ అధికారంలో ఉన్నా లేకున్నా శశికళ అన్నీతానైనట్లుగా వ్యవహరించారు. అధికార పరపతిని అడ్డుపెట్టుకుని వేలాది కోట్లరూపాయల ఆస్తులను సంపాదించినట్లుఆరోపణలున్నాయి. వీటిల్లో అనేక ఆస్తులను జయలలిత, శశికళ సంయుక్త భాగస్వాములుగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిల్లో కొడనాడు ఎస్టేట్ ఎంతో ప్రధానమైనది. భర్త నటరాజన్ అనారోగ్యం, మరణం సందర్భాల్లో శశికళ రెండుసార్లు పెరోల్‌పై చెన్నైకి వచ్చి కొన్నిరోజులు గడిపారు.
పెరోల్ ముగిసిన తరువాత ఆమె జైలుకు చేరిన కొద్దిరోజుల్లోనే 2017 నవంబరులో ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు చేశారు. పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం, శశికళ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి లెక్కల్లో చూపని భారీ ఆస్తులను గుర్తించారు. అంతేగాక రద్దయిన కరెన్సీకి సంబంధించిన సుమారు రూ.1,900 కోట్ల ఆస్తులను కొనుగోలు, రుణాలు ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ అక్రమ వ్యవహారాలకు సంబంధించి వివరణ కోరుతూ శశికళకు సమన్లు జారీ చేశారు. శశికళ తరఫున ఆమె ఆడిటర్ ఈనెల 11వ తేదీన ఐటీ అధికారులకు బదులిచ్చాడు. జయలలితకు సొంతమైనదిగా ఇటీవల వరకు ప్రచారంలో ఉండిన కొడనాడు ఎస్టేట్, మరో నాలుగు ఆస్తుల్లో 2016 నుంచి ఏప్రిల్ 1 నుంచి జయలలిత మరణించిన అదే ఏడాది డిసెంబరు 5వ తేదీ వరకు శశికళ భాగస్వామిగా మెలిగారు. జయ కన్నుమూసిన తరువాత భాగస్వామ్య సంస్థలు రద్దుకాగా శశికళ వాటి యజమానిగా మారారు. ఈ కారణంగా కొడనాడు ఎస్టేట్ ఆస్తులు శశికళకు సొంతమని ప్రకటించుకున్నారు. దీంతో శశికళ నిర్ణయాలను సవాలు చేస్తూ దీప మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ జయ వారసురాలిగా ఆమె ఆస్తులకు సంబంధించి తాను గతంలో దాఖలు చేసిన రెండు పిటిషన్లు విచారణ దశలో ఉన్న పరిస్థితుల్లో కొడనాడు ఎస్టేట్ ఆస్తులను తనకు సొంతమైనవని శశికళ ప్రకటించడం చట్టరీత్యా చెల్లదని అన్నారు. జయ ఆస్తులను సొంతం చేసుకుంటూ శశికళ వద్దనున్న డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించాలని, ముఖ్యంగా భాగస్వామ్య పత్రాలను కోరనున్నట్ల దీప తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment