హైలకండీ: మత కలహాలతో ఒక్క పక్క కర్ఫ్యూ, మరొపక్క భార్యకు పురిటి నొప్పులు.. ఏం చేయాలో రూబెన్ దాస్‌కు పాలుపోలేదు. భార్యను ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటు లేకపోవడంతో కంగారు పడ్డాడు. వెంటనే పొరుగునే ఉన్న ఆటో డ్రైవర్ మఖ్‌బూల్ తలుపుతట్టాడు. తన భార్య నందితను ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరగా క్షణం ఆలస్యం చేయకుండా ఆటో బయటకు తీశాడు మఖ్‌బూల్. కర్ఫ్యూ, పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా సురక్షితంగా ఆమెను ఆస్పత్రికి చేర్చాడు. పండంటి పాపకు నందిత జన్మనిచ్చింది. చిన్నారికి ‘శాంతి’ అని పేరు పెట్టారు.
విషయం తెలుసుకున్న జిల్లా మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి స్వయంగా మఖ్‌బూల్ ఇంటికి వెళ్లి అతడిని అభినందించారు. ఆపత్కాలంలో మహిళకు అవసరమైన సాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ- ముస్లిం ఐక్యమత్యానికి ఈ ఘటన అద్దం పట్టిందని ప్రశంసించారు. మానవత్వానికి వన్నె తెచ్చిన ఈ ఘటన అసోంలోని హైలకండీలో గతవారం చోటు చేసుకుంది. మత ఘర్షణల కారణంగా అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నెల 10న మత ఘర్షణల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపేందుకు అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్ కుమార్ బొరాతో ఏకసభ్య కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment