‘అసదుద్దీన్ ఒవైసీపై చర్యలేం తీసుకున్నారు’
న్యూఢిల్లీ: ‘భారత్‌మాతాకీ జై’ వివాదం కేసులో ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది. ఒవైసీపై స్వరాజ్ జనతా పార్టీ అధ్యక్షుడు బ్రిజేశ్ చాంద్ శుక్లావేసిన దావాను విచారించిన కోర్టు ఒవైసీపై కేసు నమోదు చేయాలని గతంలోనే ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.
దీంతో కరవాల్ నగర్ పోలీసుస్టేషన్‌లో ఆయనపై కేసు పెట్టారు. దేశద్రోహం, విద్వేషాలను రెచ్చగొట్టడం తదితర సెక్షన్లను నమోదు చేశారు. అయితే పోలీసులు అసదుద్దీన్‌పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో శుక్లా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తన గొంతుపై కత్తిపెట్టి బెదిరించినా భారత్ మాతాకీ జైకొట్టనని ఒవైసీ అనడం తెలిసిందే.