తలలు తీసేయగలం.. కానీ!
♦ చట్టంపై గౌరవంతో ఆగిపోతున్నాం
♦ భారత్ మాతా కీ జై అననివారిపై
♦ బాబా రామ్‌దేవ్ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘భారత్ మాతా కీ జై’ నినాదం మరింత వివాదాస్పదమవుతోంది. తాజాగా, ఐంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ లక్ష్యంగా యోగా గురు బాబా రామ్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఒకతను టోపీ పెట్టుకుని వస్తాడు. తన గొంతు కోసినా భారత్ మాతా కీ జై అని నినదించనంటాడు. ఈ దేశంలో చట్టం ఉంది. లేదంటే నీ ఒక్కడిదేంటి.. మేం లక్షలాది తలలు తెగ్గోయగలం. చట్టం, రాజ్యాంగంపై గౌరవం ఉంది కాబట్టి కానీ.. లేదంటే భారతమాతను ఎవరైనా అవమానిస్తే.. లక్షల తలలు నరికే సామర్ధ్యం మనకుంది’ అంటూ రామ్‌దేవ్ రెచ్చిపోయారు. రోహతక్‌లో ఆదివారం ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన సద్భావన సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలపై సోమవారం దుమారం చెలరేగింది.
ప్రతిపక్ష పార్టీలన్నీ దీనిపై మండిపడుతున్నాయి. రామ్‌దేవ్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధికారప్రతినిధి సంజయ్ ఝా ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. దేశంలోని రైతులు, ప్రజలు పడుతున్న సమస్యల నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి విమర్శించారు. భారత్ మాతాకీ జై అనడం ద్వారా మాతృభూమిపై గౌరవాన్ని, దేశభక్తిని అంగీకరించినట్లు అవుతుందని రామ్‌దేవ్ చెప్పారు. ఏ మతమైనా ఆ నినాదాన్ని వ్యతిరేకిస్తే అది జాతి హితాన్ని వ్యతిరేకించినట్లేనన్నారు.
మా స్కూళ్లలో చేరాలంటే జై అనాల్సిందే.. బీజీపీ నేత దిలీప్ సంఘానియా, తన ట్రస్టు నడుపుతున్న స్కూళ్లలో చేరాలనునే విద్యార్థులు కచ్చితంగా భారత్ మాతాకీ జై అనాలని వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.