విజయ్ మాల్యాకు హైకోర్టులో చుక్కెదురు!
న్యూ ఢిల్లీ: ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేతదారుగా తనను ఎస్బీఐ పేర్కొనడాన్ని సవాలు చేస్తూ యూబీ గ్రూప్ ప్రమోటర్ విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మాల్యా అభ్యర్థనను పరిశీలించి ఆయనకు స్వాంతన చేకూర్చే అంశం తన అధికార పరిధిలో లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విజయ్ మాల్యాకు గతంలో బాంబే హైకోర్టు నుండి కూడా ఇదే రకమైన సమాధానం వచ్చిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.
ఉద్దేశపూర్వకంగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడి, లండన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్న విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి, అతని పాస్పోర్ట్ను సీజ్ చేయాల్సిందిగా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్(డీఆర్టీ)ను ఇటీవల ఎస్బీఐ కోరింది. డియాజియో నుంచి మాల్యాకు లభించే పరిహారం నిధులను ముందుగా తమకు దఖలుపర్చడంతో పాటు దేశవిదేశాల్లో ఆయనకున్న ఆస్తుల వివరాలన్నీ వెల్లడయ్యేలా ఆదేశించాలని ఎస్బీఐ డీఆర్టీని కోరింది.