ఆప్‌ గాలిబుడగేనా! | Delhi municipal polls: AAP blames 'EVM wave' for defeat | Sakshi
Sakshi News home page

ఆప్‌ గాలిబుడగేనా!

Published Thu, Apr 27 2017 1:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

ఆప్‌ గాలిబుడగేనా! - Sakshi

ఆప్‌ గాలిబుడగేనా!

► రాజకీయ పార్టీగా అస్తిత్వాన్ని కోల్పోతుందంటున్న నిపుణులు
► ఇతర రాష్ట్రాలపై దృష్టిపెట్టి.. ఢిల్లీని విస్మరించటమూ కారణమే


న్యూఢిల్లీ: తాజా ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం.. అధికారంలో ఉన్న ఆప్‌ దారుణంగా ఓడిపోవటం కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ.. తన జోరు గాలిబుడగేనని నిరూపించగా.. మోదీ హవాలో బీజేపీ ఘన విజయం సాధించిందని విశ్లేషకులంటున్నారు. ఈ ఓటమితో ఆప్‌ ఒక రాజకీయ పార్టీగా తన అస్తిత్వాన్ని కాపాడుకునే అవకాశాలను జారవిడుచుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఆప్‌ స్కోరుకార్డు అంత దారుణంగా ఏమీ లేదు.

కానీ మోదీ హవాలో బీజేపీ మరిన్ని ఓట్లు సంపాదించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికల్లో గెలుపోటములు సహజమే. కానీ ఈ ఓటమి ఆప్‌కు చాలా నష్టం చేస్తుంది’ అని సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలిపారు. ‘గత ఎన్నికల్లో ఆప్‌ విజయం గాలిబుడగే’నని తేలిందని ఢిల్లీ వర్సిటీ రాజకీయ పరిశోధక విద్యార్థి కుమార్‌ రాజేశ్‌ తెలిపారు. మోదీ హవాపై వ్యూహం మార్చుకోకుండా పాత పద్ధతిలోనే ముందుకెళ్లటం, ఢిల్లీలో తాము చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లేబదులు.. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు ఆప్‌ నాయకత్వం పెద్ద పీట వేయటమూ ఆప్‌ ఓటమికి కారణంగా భావిస్తున్నారు.

వ్యూహాత్మకంగా బీజేపీ
పదేళ్లుగా అధికారంలో ఉన్న మూడు ఢిల్లీ మునిసిపాలిటీల్లో బీజేపీ పాగా వేయటం అంత సులభంగా జరిగిందేం కాదు. వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నపుడు వాడిన ఫార్ములానే ఢిల్లీలోనూ బీజేపీ అమలుచేసింది. ఢిల్లీలోని మూడు మునిసిపాలిటీల్లో బీజేపీ సిట్టింగ్‌ కౌన్సిలర్లను పక్కనపెట్టి అన్నిచోట్లా కొత్తవారిని రంగంలోకి దించి ఘనవిజయాన్నందుకుంది.

అంతేకాదు, ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ.. రాజ్‌నాథ్, వెంకయ్య, ఉమాభారతి, స్మృతి ఇరానీ వంటి స్టార్‌ ప్రచారకర్తలను ఢిల్లీ ప్రచారంలో మోహరించింది. ఒడిశాలో జరిగిన కీలకమైన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సైతం వీరిని దూరంపెట్టి ప్రచారం చేయించారు. పార్టీ చీఫ్‌ అమిత్‌షా కూడా ఈ ఎన్నికలపై రోజువారీ సమీక్షలు నిర్వహించారు. ఢిల్లీ కాంగ్రెస్‌ కీలకనేతలైన లవ్లీసింగ్, బర్ఖా శుక్లా సింగ్‌ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరటం కూడా పార్టీకి కలిసొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీల వైఫల్యాన్ని బీజేపీ పదేపదే ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పదే పదే చెప్పటం ద్వారా ఢిల్లీలో నివాసముండే పూర్వాంచల్‌ ప్రజల ఓట్లనూ రాబట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement