వీరేంద్ర దేవ్ దీక్షిత్
న్యూఢిల్లీ: ఢిల్లీలో అమ్మాయిలను బంధించి ఉంచిన ‘ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ్’ ఆశ్రమం స్థాపకుడు వీరేంద్ర దేవ్ దీక్షిత్ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. ఆశ్రమంలా ఉండే ఈ ఆధ్యాత్మిక వర్సిటీ తరఫు న్యాయవాది వాదిస్తూ అమ్మాయిలంతా ఇష్టపూర్వకంగానే అక్కడ ఉంటున్నారని చెప్పడంతో కోర్టు ‘వందలమందిని గదుల్లో ఉంచారు. కుటుంబీకులను, స్నేహితులను ఎవ్వరినీ కలవనివ్వడం లేదు. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు. అలాంటప్పుడు వారు ఇష్ట ప్రకారమే ఉంటున్నారని ఎలా చెప్పగలుగుతున్నారు? జంతువుల్లా బంధించి ఏం ఆధ్యాత్మిక బోధనలు చేస్తున్నారో అర్థం కావట్లేదు’ అని ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్, జస్టిస్ హరిశంకర్‌ల బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో దీక్షిత్ నడుపుతున్న ఇలాంటి మరో 8 కేంద్రాలనూ తనిఖీ చేయాలని సంబంధిత కమిటీని కోరింది.
ఎన్‌జీవో కేసుతో వెలుగులోకి
ఈ ఆశ్రమం బాగోతం ‘ఫౌండేషన్ ఫర్ సోషల్ ఎంపవర్‌మెంట్’ అనే ఎన్‌జీవో, ఆశ్రమంలో ఉంటున్న ముగ్గురు బాలికల తల్లిదండ్రులు వేసిన పిటిషన్లతో నాలుగు రోజుల క్రితం వెలుగులోకొచ్చింది. రోహిణిలో ‘ఆధ్యాత్మిక్ విశ్వ విద్యాలయ్’ పేరుతో ఉన్న ఆశ్రమంలో వందలాది అమ్మాయిలను, మహిళలను గదుల్లో బంధించారు. లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకుంటున్నారనీ, కొందరు గతంలో సూసైడ్ చేసుకున్నారనీ, పోలీసుల దృష్టికి ఈ విషయం వెళ్లినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఎన్‌జీవో పేర్కొంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్, ఇద్దరు న్యాయవాదులతో ఓ కమిటీని రంగంలోకి దింపింది. గురువారం ఆశ్రమాన్ని కమిటీ తనిఖీ చేసింది. మొత్తం నాలుగు అంతస్తులున్న ఆశ్రమ భవంతిలో దాదాపు 200 మందికి పైగా అమ్మాయిలు, మహిళలు బందీలుగా ఉన్నారనీ, అదొక కోటలా, రహస్య గదులు ఉన్నాయని కమిషన్ చైర్మన్ స్వాతి మలివాల్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment