న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. కాలుష్య పొగలు కమ్ముకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 5 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ సర్కార్ సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తోంది. ఈ పద్ధతిని వాహనదారులు సైతం స్వాగతిస్తున్నారు.
అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని వాహనదారులు ఇప్పటికే విఙ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా చుట్టుపక్కల రాష్ట్రాలతోనే ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు చేపట్టడం చేతకాక తమపై నిందలు వేస్తున్నారని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణ, రాజస్థాన్ నేతలు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకుండా పరస్పర నిందారోపణలతో కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment