చిత్తరంజన్ పార్క్ సొసైటీ
న్యూఢిల్లీ : భార్య పెద్దకర్మను హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించాలనుకున్న ఓ ముస్లిం వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ముస్లింను పెళ్లి చేసుకున్న మహిళకు సనాతన ధర్మం ప్రకారం కర్మ చేసేందుకు అంగీకరించేది లేదని ఆలయ సభ్యులు తేల్చిచెప్పడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వివరాలు... కలకత్తాకు చెందిన ఇంతియాజుర్ రహమాన్, నివేదిత ఘటక్‌లు 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మతాంతర వివాహం అయినప్పటికీ తమ తమ ఆచారాలకనుగుణంగానే అన్ని ధర్మాలు పాటిస్తుండేవారు.
కాగా అనారోగ్యంతో ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన నివేదిత... కొన్ని రోజుల క్రితం మృతి చెందింది. భార్య కోరిక ప్రకారమే.. ఢిల్లీ నిగమ్ బోధ్ ఘాట్‌లో హిందూ ధర్మం ప్రకారమే ఇంతియాజుర్ ఆమె అంత్యక్రియలు చేశాడు. అలాగే పెద్దకర్మ చేసేందుకు ఆగస్టు 12న ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్‌లోని కాళీ మందిర్ సొసైటీలో తన కూతురు ఇహ్నీ అంబ్రీన్ పేరిట స్లాట్ బుక్ చేశాడు. అందుకోసం 1300 రూపాయలు కూడా చెల్లించాడు. కానీ తాను ముస్లింను అనే విషయాన్ని దాచిపెట్టి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఆలయ సభ్యులు.. ఇంతియాజుర్ బుకింగ్‌ను క్యాన్సిల్ చేశారు.
ముస్లింను పెళ్లి చేసుకుంది కాబట్టి...
‘భార్య పెద్దకర్మ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆ వ్యక్తిని.. గోత్ర నామాలు చెప్పాల్సిందిగా మా పూజారి కోరారు. కానీ ఇందుకు అతడి దగ్గర సమాధానం లేదు. అయినా ముస్లింలకు గోత్రనామాలు ఉండవు కదా. తన భార్య హిందువని అతడు వాదిస్తున్నాడు. కానీ ఒక్కసారి ముస్లింను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను హిందువుగా భావించలేము. ఒకవేళ జాలిపడి అతడిని గుడిలోకి రానిస్తే.. తన ముస్లిం కుటుంబాన్నంతటినీ తీసుకొచ్చి గుడిలో నమాజ్ చేయడని గ్యారెంటీ ఏమిటి? అందుకే ఇటువంటి వ్యక్తులను లోపలికి అనుమతించి గుడి పవిత్రతను చెడగొట్టలేము. అయినా అతడికి భార్యపై అంతప్రేమే ఉంటే తన ఇంట్లోనే సనాతన ధర్మం ప్రకారం కర్మ చేయొచ్చుగా’ అంటూ ఆలయ సొసైటీ అధ్యక్షుడు అషితావా భౌమిక్ వ్యాఖ్యానించాడు. భౌమిక్ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో.. ‘ఇంత అమావనవీయంగా ప్రవర్తించాలా’ అంటూ అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment