మహిళలకు భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా ఢిల్లీ రవాణా సంస్థకుచెందిన బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసే పనులు ప్రారంభమయ్యాయి.
న్యూఢిల్లీ: మహిళలకు భద్రత కల్పించే ప్రక్రియలో భాగంగా ఢిల్లీ రవాణా సంస్థకుచెందిన బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసే పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో 200 బస్సులో సీసీటీవీ కెమెరాలు అమర్చుతున్నామని డీటీసీ సోమవారం తెలిపింది. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఈ పనులను ప్రారంభించిందని తెలిపింది. ఒక్కో బస్సులో మూడు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఏడు రోజుల్లో ఈ ప్రక్రియ ముగుస్తుందని డీటీసీ ప్రతినిధి ఆర్‌ఎస్ మిన్హాస్ చెప్పారు. బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చటం డీటీసీ చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇక నిర్భయంగా తమ బస్సుల్లో ప్రయాణించవచ్చని అన్నారు. సీసీటీవీ కెమెరాలను అమర్చుతున్న సంస్థనే వచ్చే ఐదేళ్ల పాటు వాటి నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఒక్కో సీసీటీవీ నిరాటంకంగా 15 రోజుల పాటు రికార్డు చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని అన్నారు. అయినప్పటికీ ప్రతిరోజు వాటి ఫుటేజీని చూస్తామని మిన్హాస్ చెప్పారు.