బస్సులు లేక బాధలు
కొన్ని మార్గాల్లోనే లేడీస్ స్పెషల్స్ సరిపోని ఏసీ బస్సులు
న్యూఢిల్లీ: మగవాళ్లతో నిండిపోయిన బస్సుల్లోంచి దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నారో... అత్యంత సురక్షితమైన మెట్రో ఉండగా మిమ్మల్ని బస్సుల్లో ప్రయాణించాలని ఎవరు చెప్పారు ? అనే సమాధానం వస్తుంది. మెట్రో ఒక్కటే అన్నింటికీ పరిష్కారం అనుకుంటారు చాలా మంది. కానీ మెట్రో కనెక్టివిటీ లేని ఢిల్లీలోని ప్రజల మాటేమిటి? సగం జీతం 15 రోజుల ఆటో రవాణా ఖర్చులకే అయిపోతే బతుకుబండి నడపడం ఎట్లా?
ఢిల్లీలోని మధ్యతరగతి, పేద ప్రజల పరిస్థితి ఇది. 2012లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై వేధింపుల నేపథ్యంలో షీలాదీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 11 మార్గాల్లో మహిళలకు ప్రత్యేక బస్సులను ప్రవేశపెట్టింది. డిసెంబర్ 16 నిర్భయ ఘటన తరువాత మరింత విస్తరిస్తూ 26 మార్గాలకు లేడీస్ స్పెషల్స్ పెంచారు.
అంతేకాదు మెట్రోలో ప్రయాణించే మహిళల కోసం మహిళా ప్రత్యేక కోచ్‌లను ఏర్పా టు చేశారు. కానీ వీటి సంఖ్యకు మహిళా ప్రయాణికుల సంఖ్యకు వ్యత్యాసం చాలా ఉంది. మహిళలు బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. గమ్యం చేరుకోగానే దిగాలంటే ఫీట్లు చే యాల్సిన పరిస్థితి. ఇక మగవాళ్లు కూడా ఉన్న బస్సుల్లో అయితే మహిళా ప్రయాణికులకు నరకమే. ఏదైనా ఘటన జరగగానే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నా అవి ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నది ప్రభుత్వం.
అసలు మహిళల సమస్యలకు ప్రాధాన్యతే ఇవ్వడం లేదు. ‘‘లేడీస్ స్పెషల్ బస్సులు నిజంగా సిటీ రోడ్లపై నడుస్తున్నాయా?’’ అని ప్రశ్నిస్తోంది ప్రైవేటు కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న సౌమ్యా త్రిపాఠి. లోధీ గార్డెన్‌నుంచి రోజూ ప్రయాణించే తాను తన రూట్‌లో లేడీస్ స్పెషల్ బస్సునే చూడలేదంటోందామె.
ఒకవేళ నడుస్తున్నా... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలి యని బస్సుల్లో కావాలని ఎవరు ప్రయాణిస్తారని ప్రశ్నిస్తోంది. లజ్‌పత్‌నగర్ నుంచి బారాఖంబాకు డీటీసీ బస్సులోనే వెళ్లే రిచా వాజ్‌పేయ్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వెలిబుచ్చింది. తమ రూట్‌లో మహిళలకు ప్రత్యేక బస్సులు నడుస్తున్నా... చాలాఅరుదుగా వస్తాయంటోందామె.
ఇదిలా ఉంటే... ‘‘మహిళా ప్రత్యేక బస్సులు నడుస్తున్న మార్గాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. స్థానిక మహిళా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ బస్సులను నడుపుతున్నాం. 500 రూట్లలో డీటీసీ బస్సులు నడుస్తుండగా లేడీస్ స్పెషల్స్ 26 మార్గాల్లో నడుపుతున్నాం. కాబట్టి అన్ని చోట్లా ఈబస్సులు కనబడవు’’ అని సమర్ధించుకుంటున్నారు.
డీటీసీ మేనేజర్ రవీం దర్ సింగ్ మిన్హా. ‘‘అంచనాల ప్రకారం 2010నాటికి నగరంలో 11వేల బస్సులు అవసరం ఉండె. ప్రస్తుతం 14వేల బస్సులు అవసరం ఉన్నా కేవలం 5వేలబస్సులు మాత్రం ఢిల్లీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. మరో నాలుగేళ్లకు మరిన్ని బస్సులు అవసరమయ్యే అవకాశం ఉంది. తక్కువ బస్సులతో ఎక్కువ ట్రిప్పులు ఎలా వేయగలం అంటున్నారు మరో డీటీసీ అధికారి.
ఈ వేసవికి కొత్త ఏసీ బస్సుల్లేనట్లే...
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వంగపండు రంగు ఏసీబస్సుల కల ఈ ఏడాది కూడా తీరేటట్టు లేదు. ఈ వేసవికల్లా అందించాలని ప్రైవేటు సంస్థలతో డీటీసీ ఒప్పందం కుదుర్చుకున్నా... సమయానికి బస్సులు అందుబాటులోకి రాలేదు.
ఈ ఆలస్యం వల్ల ఈ వేసవిలో ఢిల్లీ ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. డీటీసీలో ఉన్న ఎరుపురంగు ఏసీ బస్సులలాగే వంగపండు రంగు ఏసీ బస్సులు కూడా అందించాలని రవాణాశాఖ ప్రైవేటు ఆపరేటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో కేవలం ఎనిమిది లోఫ్లోర్ బస్సులు ఈ వేసవికి రావచ్చని అధికారులు భావిస్తున్నారు. సీఎన్‌జీతో నడిచే సెమీ లోఫ్లోర్ ఏసీ బస్సుల తయారీ కష్టంగా ఉందని ఏజెన్సీ చాలా ఆలస్యంగా తమకు తెలిపిందని అధికారులు చెబుతున్నారు.
ఖరీదు ఎక్కువ కావడంతో లోఫ్లోర్ బస్సుల మీద పెట్టుబడి పెట్టడానికి ప్రయివేటు ఆపరేటర్స్ ముందుకు రావడం లేదని, తయారీ దార్ల నుంచి సెమీ లోఫ్లోర్ మోడల్స్ కోసం ఎదురు చూస్తున్నారని అధికారులంటున్నారు. ఉన్న ఏసీ బస్సుల్లో సరిపడినంత చల్లదనం లేకపోవడం, మధ్యమధ్యలో ఆగిపోతుండటంవల్ల... కొత్త ఏసీ బస్సులు రావడంలో ఆలస్యం అనేది ఢిల్లీ ప్రయాణికుల చేదువార్త.
‘‘డీటీసీ రెడ్ బస్సులకంటే మంచి సౌకర్యాన్నిచ్చే ప్రైవేటు ఆపరేటర్లు ఏసీ బస్సుల్లో ప్రయాణించాలని ఎదురు చూశాను. కానీ నా ఆశ ఈ ఏడాది తీరేటట్టు లేదు. ఏసీ బస్సుల్లో ప్రయాణం కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా మెట్రోలాగా సౌకర్యవంతంగా ఉంటుంది’’ అంటున్నాడు జామియా మిలియా ఇస్లామియా ఇంజనీరింగ్ విద్యార్థి హిమాన్షు.
ఢిల్లీ ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకున్న తొమ్మిది ప్రైవేటు సంస్థలలో ఎనిమిది కాంట్రాక్టు బాధ్యతల్లో ఉన్నాయి. ఐదువేల రెడ్ ఏసీ బస్సులుండగా కామన్‌వెల్త్ క్రీడలకు ఉపయోగించడంతో కొన్ని పాడయ్యాయి. వీటిలో దాదాపు వెయ్యి తరచూ బ్రేక్‌డౌన్ అవుతుండటంతో ప్రస్తుతం నాలుగు వేలు మాత్రమే నడుపుతున్నారు.
2013 ఏప్రిల్‌నుంచి సెప్టెంబర్ వరకు తరచూ బ్రేక్‌డౌన్స్ అవుతుండటంతో ఏసీ బస్సులను నిర్వహణ చూసుకునే రెండు బస్సు కంపెనీలకు రూ.20 కోట్ల వరకు జరిమానా విధించారు. లోఫ్లోర్ బస్సుల తయారీకి టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం డీటీసీకి సమస్యగా మారింది. అంత రద్దీగా లేని ప్రాంతాల్లో నడిపేందుకు చిన్న, మధ్యరకమైన బస్సులను కొనుగోలు చేయాలని ఈ సంస్థ భావిస్తోంది.