సాక్షి, హైదరాబాద్ : ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది పరీక్ష గదుల్లో ఫోన్ జామర్స్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఎంట్రన్స్ పరీక్షల్లో అవకతవలకు సంబంధించి ఎనిమిది ఎఫ్‌ఐఆర్‌లను వర్సిటీ నమోదు చేసిన క్రమంలో ఈ ఏడాది అత్యంత పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో సరైన సమాధానాలు రాయలేదని అభ్యర్ధులు చెప్పేందుకు అవకాశం లేకుండా పరీక్ష అనంతరం ఆన్‌లైన్ టెస్ట్‌ల్లో తాము రాసిన సమాధానాలను రాసేలా రెస్పాన్స్ షీట్స్‌ను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా 89 కేంద్రాల్లో ప్రత్యేక పరిశీలకులను ఢిల్లీ యూనివర్సిటీ నియమించింది. ఇక జామర్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ నుంచి తెప్పించామని, వీటి గురించి తాము ముందస్తుగా వెల్లడించలేదని, పరీక్షలు నిర్వహించే ముందే ప్రణాళికాబద్దంగా వీటిని పరీక్షించామని వర్సిటీ అధికారి వెల్లడించారు.
కాగా గత ఏడాది అభ్యర్ధులు సరైన సమాధానాలు రాబట్టేందుకు పరీక్ష హాల్ వెలుపల కొందరితో వాట్సాప్ ఫీచర్‌తో కనెక్ట్ అయినట్టు తమ విచారణలో వెల్లడైందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొందరు దళారులు విద్యార్ధులను రూ 50,000 నుంచి రూ లక్ష వరకూ డిమాండ్ చేస్తూ పరీక్షలు పాసయ్యేలా తాము పూర్తిగా సహకరిస్తామని ప్రలోభపెడుతున్నారని, ఇలాంటి మోసాలకు జామర్ ద్వారా చెక్ పెట్టామని అధికారులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపట్టామని ఢిల్లీ వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ వినయ్ గుప్తా చెప్పారు. జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో పర్మనెంట్ లెక్చరర్లను నియోగించారు.
Comments
Please login to add a commentAdd a comment