Jammers
-
వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు విక్రయించొద్దు
న్యూఢిల్లీ: ప్రభుత్వ అనుమతులు అవసరమయ్యే వైర్లెస్ జామర్లు, నెట్వర్క్ బూస్టర్లు వంటి టెలికం పరికరాలను విక్రయించరాదని ఈ–కామర్స్ సంస్థలను టెలికం శాఖ (డాట్) హెచ్చరించింది. ‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతులిస్తే తప్ప సెల్యులార్ సిగ్నల్ జామర్లు, జీపీఎస్ బ్లాకర్లు లేదా ఇతరత్రా సిగ్నల్స్‌ను జామ్ చేసే పరికరాలను వినియోగించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. దేశీయంగా ప్రైవేట్ రంగ సంస్థలు లేదా ప్రైవేట్ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయడం లేదా వినియోగించుకోవడం వంటివి చేయరాదు‘ అని ఒక ప్రక టనలో తెలిపింది. మార్గదర్శకాల్లో పేర్కొన్న దానికి భిన్నంగా సిగ్నల్ జామింగ్ పరికరాల ప్రకటనలు ఇవ్వడం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేసుకోవడం లేదా ఇతరత్రా మార్కెటింగ్ చేయడం వంటివన్నీ కూడా చట్టవిరుద్ధమని పేర్కొంది. గడిచిన 4–5 ఏళ్లుగా డాట్ ఈ అంశాన్ని అనేక సార్లు లేవనెత్తింది. ఈ పరికరాల అక్రమ విక్రయాలను అడ్డుకునేందుకు పలు మార్లు దాడులు కూడా నిర్వహించింది. వైర్లెస్ జామర్లను విక్రయించడం లేదా వాటి అమ్మకానికి వెసులుబాటు కల్పించడం వంటివి చేయరాదంటూ ఈ–కామర్స్ కంపెనీలన్నింటికీ జనవరి 21న డాట్ నోటీసు కూడా జారీ చేసింది. మరోవైపు, మొబైల్ సిగ్నల్ బూస్టర్ల వంటి అక్రమ పరికరాల అనధికారిక వినియోగం వల్ల టెలికం సర్వీసులపై ప్రతికూల ప్రభావం పడుతోందని టెల్కోల సమాఖ్య సీవోఏఐ పేర్కొంది. వీటి వినియోగం చట్టరీత్యా నేరమన్న సంగతి చాలా మంది ప్రజలకు తెలియదని, తాజా ఆదేశాలతో ఈ అంశంపై అవగాహన పెరగగలదని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. -
జామర్ల నిబంధనలను పాటించాల్సిందే: యూజీసీ
న్యూఢిల్లీ: పరీక్షా కేంద్రాల్లో జామర్లు ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలకు సూచించింది. ప్రభుత్వ జామర్ విధానం ప్రకారం జామర్లు ఏర్పాటు చేయాలనుకుంటే భద్రతా కార్యదర్శి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు రాసిన లేఖలో యూజీసీ తెలిపింది. అలాగే ప్రతీ కేంద్రంలో జామర్ల పనితీరును పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా నిరోధించేందుకు పరీక్షా కేంద్రాల్లో తక్కు వ సామర్థ్యం గల జామర్లు ఏర్పాటు చేసేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. -
జామర్లతో అక్రమాలకు ఢిల్లీ వర్సిటీ చెక్
సాక్షి, హైదరాబాద్ : ఎల్ఎల్బీ కోర్సు ప్రవేశ పరీక్షలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది పరీక్ష గదుల్లో ఫోన్ జామర్స్‌ను ఏర్పాటు చేశారు. గత ఏడాది ఎంట్రన్స్ పరీక్షల్లో అవకతవలకు సంబంధించి ఎనిమిది ఎఫ్ఐఆర్లను వర్సిటీ నమోదు చేసిన క్రమంలో ఈ ఏడాది అత్యంత పకడ్బందీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు సాంకేతిక సమస్యలతో సరైన సమాధానాలు రాయలేదని అభ్యర్ధులు చెప్పేందుకు అవకాశం లేకుండా పరీక్ష అనంతరం ఆన్లైన్ టెస్ట్‌ల్లో తాము రాసిన సమాధానాలను రాసేలా రెస్పాన్స్ షీట్స్‌ను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 89 కేంద్రాల్లో ప్రత్యేక పరిశీలకులను ఢిల్లీ యూనివర్సిటీ నియమించింది. ఇక జామర్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీ నుంచి తెప్పించామని, వీటి గురించి తాము ముందస్తుగా వెల్లడించలేదని, పరీక్షలు నిర్వహించే ముందే ప్రణాళికాబద్దంగా వీటిని పరీక్షించామని వర్సిటీ అధికారి వెల్లడించారు. కాగా గత ఏడాది అభ్యర్ధులు సరైన సమాధానాలు రాబట్టేందుకు పరీక్ష హాల్ వెలుపల కొందరితో వాట్సాప్ ఫీచర్‌తో కనెక్ట్ అయినట్టు తమ విచారణలో వెల్లడైందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. కొందరు దళారులు విద్యార్ధులను రూ 50,000 నుంచి రూ లక్ష వరకూ డిమాండ్ చేస్తూ పరీక్షలు పాసయ్యేలా తాము పూర్తిగా సహకరిస్తామని ప్రలోభపెడుతున్నారని, ఇలాంటి మోసాలకు జామర్ ద్వారా చెక్ పెట్టామని అధికారులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేపట్టామని ఢిల్లీ వర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ వినయ్ గుప్తా చెప్పారు. జామర్లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల్లో పర్మనెంట్ లెక్చరర్లను నియోగించారు. -
చర్లపల్లి, చంచల్ గూడలో జామర్లు: వీకే సింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో అవినీతికి తావు లేకుండా చర్యలు తీసుకుంటామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ అన్నారు. కరప్షన్ ప్రీ అడ్మిస్ట్రేటివ్ అడ్మిషన్లకు కృషి చేస్తున్నామని వీకే సింగ్ మీడియాకు తెలిపారు. అవినీతిక అడ్డుకట్ట వేయలేకపోతే పూర్తి బాధ్యత నాదేనని ఆయన అన్నారు. 3 నెలల కాలంలో జైళ్లలో అవినీతిని నిర్మూలిస్తామన్నారు. చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో జామర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అన్ని జైళ్ల శాఖలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. విద్యదానం కార్యక్రమం ఖైదీలలో మంచి సత్పలితాలను ఇస్తోందని వీకేసింగ్ చెప్పారు. -
ఎంసెట్ పరీక్ష కేంద్రాల వద్ద జామర్లు: కన్వీనర్
ఈ నెల 22న ఎంసెట్ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పరీక్ష కన్వీనర్ రమణారావు వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో రమణారావు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ పరీక్షకు మొత్తం 3,95,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మెడికల్ విభాగంలో 1,12,800 మంది విద్యార్థులు, ఇంజనీరింగ్ విభాగంలో 2,82,750 మంది విద్యార్థులు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేశారని చెప్పారు. మెడికల్ విభాగంలో దాదాపు 300 మంది విద్యార్థులు చేసిన దరఖాస్తులపై పలు అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. సదరు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. పలు ప్రాంతాలలో ఎంసెట్ పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఆయా కేంద్రాలలో జామర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు రమణారావు వెల్లడించారు.